May 06,2022 07:21

నా కళ్లు దేశంలోని ఆకలి చావులను చూస్తున్నాయి.
నీ కళ్లు పరమతం లోని ఆహారపు అలవాట్లను చూస్తున్నాయి.

నా కళ్లు దేశంలోని రైతుల ఆత్మహత్యలను చూస్తున్నాయి.
నీ కళ్లు దేశంలోని 600 అడుగుల సర్దార్‌ వల్లభారు పటేల్‌ విగ్రహాన్ని చూస్తున్నాయి.

నా కళ్లు దేశంలోని మత కలహాలను చూస్తున్నాయి.
నీ కళ్లు పటంలో లేని అఖండ బారతదేశాన్ని చూస్తున్నాయి.

నా కళ్లు దేశంలోని మానభంగాలను చూస్తున్నాయి.
నీ కళ్లు ఆడవాళ్లు ఏ దుస్తులు ధరించాలో అని చూస్తున్నాయి.

నా కళ్లు దేశంలో జరుగుతున్న కుల దురహంకార హత్యలను చూస్తున్నాయి.
నీ కళ్లు నీ కులం గొప్పతనాన్ని చూస్తున్నాయి.

నా కళ్లు నిర్వీర్యం అయిపోతున్న రాజ్యాంగాన్ని చూస్తున్నాయి.
నీ కళ్లు పోలింగులో ఒడిపోతున్న నీ సినిమా హీరోలను, క్రికెట్‌ దేవుళ్లను చూస్తున్నాయి.

నా కళ్లు దేశంలో పెరుగుతున్న నిరుద్యోగాన్ని చూస్తున్నాయి.
నీ కళ్లు అయోధ్యలో కట్టబోతున్న రామాలయాన్ని చూస్తున్నాయి.

నా కళ్లు ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నించిన జెఎన్‌యు విద్యార్థుల మీద దుర్మార్గపు దాడులను చూస్తున్నాయి.

నీ కళ్లు ప్రశ్నించిన గొంతులు పాకిస్తాన్‌ మద్దతుదారులేమో అని చూస్తున్నాయి.

అవునూ....నా కళ్లలో ఏదైనా లోపముందా?

బహుశా జరుగుతున్న అన్యాయాన్ని చూసినందున నావి దేశద్రోహి కళ్లేమో !!

- అజ్ఞాత కవి