Feb 14,2022 07:06

చెమట చిత్తడి నేల, స్పర్శ, అనుపమ, ఊరి కల కవితాసంపుటాలతో తనకంటూ ఒక ప్రత్యేక పంథాను సొంతం చేసుకున్న మట్టిమనిషి, రైతుకవి బండ్ల మాధవరావు. ఆయన తాజాగా ప్రకటించిన కవిత్వజాడ 'దశ్య రహస్యాల వెనుక'. మిగతా సంపుటాల కన్నా ఈ పుస్తకానికి ప్రత్యేకత ఉంది. మట్టి తన రూపం కోల్పోయి, రైతు ఆకాశంలో గిరికీలు కొడుతున్న సంక్షుభిత సందర్భంలో లోకం ఎదుట ప్రదర్శించిన ఈ కవితాదృశ్యాలు... వర్తమాన గాయాల వెనుక రహస్యాలు!
మాధవరావు కవిత్వం లలితంగా ఉంటుంది. సరళంగా సాగుతుంది. తేలికైన పదాల పొందికతో వాక్యాలు పరుగులు తీస్తాయి. అట్లా అని ఆయన సంధించే అక్షరం నంగిగా మూల్గదు. విధేయంగా ఉండదు. వంగివంగి నడవదు. ధీమాగా గొంతు విప్పుతుంది. ప్రశ్నిస్తుంది. గర్జిస్తుంది. నిటారుగా నడుస్తుంది. మట్టికీ మనిషికీ మధ్య సంబంధం విచ్ఛిన్నమవుతున్న అత్యంత దురదృష్టకర దృశ్యాలు ఈ సంపుటిలోంచి పైకిలేచి మనల్ని గాయపరుస్తాయి. దాంతోపాటు ప్రశ్నార్థక మవుతున్న ఉనికి, జీవనమూలాల శైథిల్యం, సామాన్యుడి నైరాశ్యం, రాజకీయ అరాచకం, కాషాయ పైత్యం, వేధిస్తున్న వైరస్‌ వంటి వివిధ అంశాలపై రాసిన కవితలు బలంగా గుండెల్ని తాకుతాయి.
'తాత, నాన్న జ్ఞాపకాలతో తడిసిన ఇంట్లో' పుట్టిన కవికి బాల్యంలో అపురూమైన అనుభవాలున్నాయి. 'నిలువెత్తు మేటు గట్టిన పత్తిమండెలతోనో/ పొగాకు బేళ్లతోనో వేరుశనగ రాశులతోనో/ నిరంతరం పొలాన్ని కుప్పబోసినట్లు/ పంచ అంతా పంటలతో కళకళలాడుతూ' ఉండేది. ఓ కుటుంబం కదలాడుతూ ఉండేది. 'తాతనుండి మనవడిదాక/ ఓ జీవజల ఎగసిపడుతూ' ఉండేది. ఊరి నిండా దోస్తులూ మామయ్యలూ అత్తయ్యలూ బాబాయిలూ పిన్నమ్మలూ ఉండేవారు. ఇంట్లోంచి కాలు బయటపెడితే ఆత్మీయతాను రాగాలు తొణికిసలాడేవి.
కాలం గిర్రున తిరిగింది. ఎక్కడో ఉండాల్సిన రాజధాని ఊరి నడిబొడ్డుకొచ్చి నిలబడింది.మట్టికీ మనిషికీ, మనిషికీ డబ్బుకీ, డబ్బుకీ సౌఖ్యాలకీ మధ్య చిత్రవిచిత్రమైన సంబంధాలు వీధి అరుగులపైకెక్కి కూచున్నాయి. కృత్రిమత్వ మేదో గాలినిండా వ్యాపించింది. ఈ పరిణామాలన్నీ మాధవ మనసును మెలి పెట్టాయి. ఆ ఆవేదనలోంచి అంటున్నారు... ''ఊళ్లోకి రాబోయే అంకుల్‌ ఆంటీల కోసం/ పొలాలు పంటల్ని ఖాళీ చేస్తున్నాయి/ పచ్చదనం మీద మొలవబోయే/ కాంక్రీటు వనాలకోసం/ మట్టిలోంచి పుట్టాల్సిన అన్నం మెతుకులు/ పైకి రావడానికి దారిలేక/ తిరిగి మట్టిలోకే ముడుచుకొంటున్నాయి'' (మా ఊరు రాజధానయ్యింది)
పోనీ, నిజంగానే అక్కడ రాజధాని వెలిసిందా? సరికొత్త ప్రపంచమేదైనా ఆవిష్క ృతమైందా? లేదు. రాజధాని అక్కడ ఉందో లేదో తెలియదు. తన జన్మభూమి ఇప్పుడు ఊరూ కాదు, నగరమూ కాదు. జనం తమ పాదాలు నేలమీద నిలబడి ఉన్నాయో, ఆకాశంలో తేలియాడుతున్నాయో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. ఈ పరిణామాల పర్యవసనామే 'విరిగిన కల'. 'లాటరీగా మారిన ఆకలివేటలో/ నిన్నూ నీ ఊరినీ నీ పొలాల్నీ కోల్పోయాక/ ఊరించిన రాజధాని సౌధం/ హఠాత్తుగా కళ్లముందే కుప్పకూలి పోయింది'. భారీయంత్రాలు, వలసకూలీలు పైకిలేపిన ఆకాశహర్మ్యాలు ఇంకా పూర్తి కాకముందే తరలింపు ప్రకటన బాంబులా పేలింది. 'పాత ఇంటిని పీకేసి కట్టిన కొత్త ఇంటికి/ గృహప్రవేశం చెయ్యనే లేదు/ అప్పటిదాకా పచ్చబారిన మట్టి/ అప్పటిదాకా అన్నమైన మట్టి/ అప్పటిదాకా జీవితమైన మట్టి/ గిరికీలు కొడుతూ కాళ్లముందు సాగిలపడింది/ జెండాల ఎజండాల నేపథ్యంలో ఊరు / ఆంక్షల సంకెళ్ల మధ్య/ ఊపిరి కోసం అల్లాడుతోంది' అని అనంతర పరిణామాలతో తీవ్రంగా గాయపడిన స్థానికుల వేదనను ప్రతిభావంతంగా కవిత్వీకరించారు.
ఈ గందరగోళ దృశ్యాల నడుమ మట్టి మాయమైపోతోంది. తేమ ఆవిరైపోతోంది. పొలం అదృశ్యమవుతోంది. పని- నిన్నటి ఖాళీని పూరించిన పవిత్రకర్మ. శ్రమ- నిన్నటి శరీరం చిందించిన చెమటచుక్క. ఇప్పుడు ఆ రెంటి అవసరమూ లేక ఏకంగా చేతులే మాయమైపోయాయి. 'ఒకానొక ఉదయాన/ నిద్రలేచి చూసుకొనేటప్పటికి/ నా చేతులు అదృశ్యమైపోయిన' రహస్యాన్ని బయట పెట్టారు. 'చేతులు లేకపోవడం మనిషి లేకపోవడం లాంటిదే కదా' అని మనల్ని ఉలిక్కిపడేలా చేస్తారు. 'ఇప్పుడు నేను/ పని లేనోడినయ్యాను/ పని- బతకడానికేనా/ బతికించడానికి కూడా కదా/ పనంటే మట్టి/ మట్టిలోంచి అన్నం/ కాళ్లకింద మట్టి పెళ్లగించబడ్డాక/ అన్నం లేదు/ అన్నం పెట్టే పనీలేదు' (మాయమైన చేతులు). మట్టి పిసికిన చేతులు, దుక్కి దున్నిన చేతులు, కోత కోసిన చేతులు రాజ్యం దాడిలో ధ్వంసమయ్యాయన్న నగసత్యాన్ని బలంగా రికార్డు చేశారు.
రాష్ట్రమేమిటి, దేశమేమిటి! నాగలి నాలుగుదిక్కులా విలపిస్తూనే ఉంది. బరువు మోయలేక వెన్నెముక వంగిపోతూనే ఉంది. కొత్త చట్టాల కొరడా దెబ్బలు తినే ప్రసక్తే లేదని తలపాగాలు పొలాల్ని వదిలి రోడ్లెక్కాయి. ఆ రైతన్నలకు కవి షరతుల్లేని మద్దతు ప్రకటిస్తున్నారు 'నగరాన్ని ముట్టడించిన నాగళ్ళు' రూపంలో. 'ఆకాశ దారుల్లో మట్టి మనుషులు/ పచ్చని దేహాన్ని ఎగరేస్తున్నారు/ కొత్త చట్టాల ఎజెండాల్లో హరిత వర్ణ పతాకం/ పొలాల మధ్య కదలాడుతూ/ రాజధాని రోడ్లను చుట్టుముడుతోంది' అని అక్కడి దృశ్యాన్ని ఆవిష్కరించిన కవి 'ఎప్పటికైనా నగరాన్ని ముట్టడించిన/ నాగళ్లదే అంతిమ విజయం' అని ముందే భాష్యం చెప్పారు.
సంపుటి మకుటంగా నిలిచిన 'దృశ్య రహస్యాల వెనక' అద్భుతమైన కవిత. 'గొంతులోంచి మాట బయటకు రాకముందే/ గొంతు చుట్టూ బిగిస్తున్న ఉరితాళ్లు/ అనేక అణచివేతల మధ్య/ ప్రశ్నపై వాడు ఆధిపత్యం చలాయిస్తున్నాడు' అని విస్పష్టంగా చెప్పి 'నిజానికి మట్టి కదా నా ఉనికి' అని ఘనంగా చాటుకున్న కవి ఆ ఉనికిని మాయం చెయ్యాలని చూస్తున్న శక్తులపై యుద్ధం ప్రకటిస్తారు. గోవులో తులసిదళాలో స్వామిభక్తికి కొలమానాలుగా రాజ్యమేలుతున్న దుర్బలత్వాన్ని నిరసిస్తారు. అదృశ్యంగా పొంచి ఉండే తుపాకుల పహారా, ముళ్లతీగలు, గోడల్ని బద్దలు కొట్టాల్సిన అవసరాన్ని వక్కాణిస్తారు. ఈ పరిష్కార ప్రస్తావన కవితలో ఎక్కడా కనిపించదు. అదే ఈ కవితలోని శిల్ప రహస్యం.
కవి పేదల పక్షపాతి. పీడనకు మూలాలు వెతకటంలోనే అతని నిరంతర అన్వేషణ. ఎంత వెతికినా ఆ మూలాలు వెళ్లీవెళ్లీ రాజ్యంలోనే విలీనమవుతున్న రహస్యాన్ని బహిరంగం చేస్తారు. గాల్లోంచి పూలు పూయించి, భవనాలు మొలిపించి, సంక్షేమం జపించి, స్వర్గాలు సృష్టించేది సింహాసనమేనని నిర్ధరిస్తారు. నెగ్గుకు రావటం కోసం వాళ్లు చెప్పే మాటలు కూడా ఎంత వక్రంగా ఉంటాయో ధ్వనిస్తారు. 'మకిల పట్టిన మాటల్ని/ చిలుము పట్టిన మాటల్ని/ చింతపండుతోనో/ పొయిలోని బూడిదతోనో' తోమాలంటారు 'మాటల అంచున' కవితలో. వంకర తిరిగిన, చొట్టలు పడిన మాటల్ని సాపు చెయ్యాలంటారు. కన్యాకుమారి నుంచి కాశ్మీరు దాకా ఈ మాటలు దీర్ఘకాలిక వ్యాధులతో తీసుకుంటున్నాయి. అధివాస్తవ అధికరణాలు, ఆంక్షల ఆజ్ఞలు కుంకుమపూల లోయను కాంతిహీనం చెయ్యాలని చూస్తున్న కుట్రల్ని కవి బహిరంగం చేస్తున్నారు. ఇనపబూట్ల తొక్కిడిలో, కవాతుల కనుసన్నలలో భావి ఆశలరెక్కలు తెగిపడుతున్న క్రూరత్వాన్ని కవిత్వీకరిస్తున్నారు. 'బతకడమే యుద్ధమవుతున్న చోట/ ఎవడెందుకు ఆయుధమవుతున్నాడో/ ఎవడెందుకు మందుపాతరవుతున్నాడో/ కారణాలు సమాధవుతున్న' (కుంకుమపూల విధ్వంసం) కాశ్మీరులోని నిత్య మారణ హౌమాల వెనక రాజకీయ ఎజెండాలను ఎండగట్టారు. 'ఇల్లూడ్చినట్లు, అంట్లు కడిగినట్లు/ పిల్లల పీతిగుడ్డలుతికినట్లు' ఈ దేశపు దేహాన్ని శుభ్రపరచాలని 'కొత్త చిగుళ్ల కోసం'లో ప్రతిపాదించారు.
మాధవ కవిత్వంలో వాక్యాలు ఒకదాని వెంట ఒకటి ధారలా కురుస్తాయి. వస్తువు తాలూకు అంతర్‌ బహిర్‌ ఛాయలన్నీ క్యూలో నిలబడి ఘోషిస్తాయి. ఆ గాఢత ధాటికి హృదయం చెమ్మగిల్లుతుంది. ఈ సంపుటిలోని కవితలన్నిటా అలాంటి వాక్యాలెన్నో ఉన్నాయి. ఈ సంపుటికి సంపాదకత్వ బాధ్యతను సమర్థంగా నిర్వహించటంతోపాటు 'కవిత్వం వొక సజీవ బంధం' ఎలా అవుతుందో గొప్పగా విశ్లేషించారు ఎ.కె.ప్రభాకర్‌. భువనచంద్ర రాసిన 'జ్వాలామాధవీయం' ఒక ఆత్మీయ భాషణ. ఉమారాణి గారి 'దేవిప్రియ జ్ఞాపకాలు' చదువుతుంటే కన్నీటిని నియంత్రించటం చాలా కష్టం. ఈ సంపుటిని దేవిప్రియ గారికి అంకితమివ్వటం ద్వారా ఆయన పట్ల తన అపార గౌరవాన్ని చాటుకున్నారు కవి. గిరిధర్‌ అరసవల్లి పుస్తకం గెటప్‌నీ, ముఖపత్రాన్నీ అందంగా తీర్చిదిద్దారు. ప్రతుల కోసం 88976 23332 నెంబర్లో కవిని సంప్రదించొచ్చు.

                                                                                            - ఎమ్వీ రామిరెడ్డి .... 98667 77870