Feb 21,2022 08:08

ఒక ఇల్లు
దాన్లో కిటికీలు మాత్రమే ఉండాలి
ఒక్క తలుపు కూడా ఉండకూడదు
ఎంత విచిత్రం
అలాటి ఇంటి గురించి ఊహించడం !
ఎవరు ఆలోచించగలరు
అలాటి వంకర టింకర ఊహలు ఎవరికుంటాయి?
మొగవాళ్ళ ఊహల్లోకి రాగలదా
ఎప్పుడైనా ఇలాటి ఇల్లు?
మొగవాళ్ళు తలుపుల శిల్పులు
వాళ్ళ వాస్తు శాస్త్రంలో
కిటికీలు ఉండటం అశుభం!

గాలులు బైటినుంచి లోపలకి రావటం
అశుభం
గాలులూ, కోరికలూ ఆడవాళ్ళ గదుల్లోకి రావటం అశుభం
వాళ్ళ వాస్తు శాస్త్రంలో
చీకటికి అలవాటుపడి పాలిపోయిన మొహాలతో
వెలుతురు కావాలని కోరుకోవటం కూడా తెలియని
ఆడవాళ్లుంటారు ఆ ఇళ్ళలో
వాళ్ళ వాస్తు శాస్త్రంలో
ఆడవాళ్ళ ప్రసక్తి ఉంటుంది
కానీ వాళ్ళు
గాలీ, ఎండా, ప్రపంచం గురించి
ఆలోచించటం నిషిద్ధమనీ
గాఢమైన కోరికలూ
తేమ నిండిన గాలీ
రంగు రంగుల మబ్బులూ
వాన చినుకులకి
పులకించే ఆడవాళ్ళు
వాళ్ళ వాస్తు శాస్త్రంలో అశుభానికి ఆనవాళ్ళు
తమ కలల్లో జీవించే స్త్రీలు
తమ కళ్ళల్లోని శూన్యం వెనక దాక్కున్నారు
వాళ్ళ కలల శిలీంధ్రాలు చచ్చిపోలేదు
మొగాళ్ళు భయపడుతున్నారు
ఇంకా చావకుండా ఉండి పోయిన ఆ కలల శిలీలాంద్రాలు చూసి
రాయి కింద అణిగిపోయి రంగు కోల్పోయిన
పచ్చగడ్డిని చూసి
ఋతువులు మళ్ళీ చిగురిస్తాయన్న భయంతో ..
కిటికీలకి శత్రువులు
మొగవాడిని
తలుపు దగ్గర గొప్పగా పెట్టుకున్న
తన నేమ్‌ ప్లేట్‌ దగ్గరే ఆపేస్తాయి
ఋతువుల పరిమళాన్ని లోపలకి రావద్దని బెదిరిస్తాయి.
తలుపుల్ని ఎదిరిస్తూ
స్త్రీలు చేసిన ఊహాసృష్టి
కిటికీలు
తలుపు
కేవలం ప్రవేశం కోసమే
అందులోంచి ఆడది సజీవంగా లోపలకి ప్రవేశిస్తుంది
ఒకేసారి బైటికి వెళ్ళగలదు
చచ్చి పోయాక.
ఇదే మన మనుస్మ ృతి ఆజ్ఞ
మనుస్మ ృతి ప్రతిబంధకాలలో
బందీ స్త్రీ
తమ ఊహల్లో విడుదల పొందుతున్నారు
కిటికీల వాస్తు శిల్పాన్ని నేర్చుకుంటున్నారు
గుమ్మాలూ, గోడలూ లేని ఇల్లు కోసం కాంక్షిస్తూ
గాలిబ్‌ దగ్గర నేర్చుకుంటున్నారు
కర్పూరంలా గాలిలో కలిసిపోవటం
అదృశ్యమవటం
మూసిన తలుపుల్ని దాటి వెళ్లి పోవటం
తమ కోరికల గారడీతో
ఆడవాళ్లే ఆలోచించగలరు
ఇంటి గురించి కిటికీల గురించి
స్వేచ్ఛ గురించి మనువు గురించి
ఇల్లు నిర్మించే వాస్తుకళని
నేరుస్తున్నారు స్త్రీలు
మనువుకీ, మొగవాళ్ళకీ
ఇష్టం లేకపోయినా, వాళ్ళని ఎదిరిస్తూ ...
 

మూలం : రంజనా జాయస్వాల్‌
అనువాదం : ఆర్‌.శాంతసుందరి