Jul 17,2023 13:02

ఇంఫాల్‌  :  మణిపూర్‌లో గత 70 రోజులుగా కొనసాగుతున్న హింసాకాండ ఇప్పుడప్పుడే సద్దుమణిగే పరిస్థితి కనిపించడం లేదు. మహిళ హత్యకేసులో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. హత్యకు పాల్పడిన వారిలో ఐదుగురు మహిళలు ఉన్నారని, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. వారి నుండి రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఇంఫాల్‌ తూర్పు జిల్లాలోని సావొంబంగ్‌ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఓ మహిళను కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఈ హత్యలో ఎవర పాత్ర ఉన్నా తప్పక చర్యలు తీసుకుంటామని ఇంఫాల్‌ ఈస్ట్‌ ఎస్‌పి తెలిపారు. హత్యకు గురైన మహిళ మారింగ్‌ నాగా కమ్యూనిటీకి చెందినదని, నిందితుల్లో ముగ్గురిని ఆప్రాంతం నుండి బహిష్కరించనున్నట్లు హికప్‌మాల్‌ గ్రామీణాభివృద్ధి కమిటీ తెలిపింది.

మహిళ హత్యకు వ్యతిరేకంగా నాగా అత్యున్నత కమిటీ యునైటెడ్‌ నాగా కౌన్సిల్‌ (యుఎన్‌సి) సోమవారం బంద్‌కు పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని నాగాలు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో ఉదయం 6 గంటలకు ప్రారంభమైన బంద్‌ 12 గంటలపాటు కొనసాగనున్నట్లు ప్రకటించింది. హత్యపై న్యాయ విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్ష విధించాలని యుఎన్‌సి డిమాండ్‌ చేసింది. మే 3 నుండి ఇప్పటివరకు 150 మందికి పైగా మరణించగా, వేలాది మంది ప్రజలు గాయపడ్డారు.