మహిళల ఆర్థికాభివృద్ధే సిఎం లక్ష్యం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : మహిళలను ఆర్థికంగా బలవంతులుగా మార్చే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, ఈ పథకాలతో మహిళలు వారి కుటుంబాలను మరింత వృద్ధిలోకి తెచ్చుకోవాలని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ ఆసరా 3వ విడత నగదు చెక్ పంపిణీ కార్యక్రమానికి ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం పొదుపు మహిళలు పూలవర్షం కురిపిస్తూ ఎంఎల్‌ఎకు అపూర్వ ఆహ్వనం పలికారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం వైఎస్‌ఆర్ ఆసరా కార్యక్రమం గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సందేశాన్ని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్ రెడ్డి ఆవిష్కరించి అందరికీ అందజేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ విక్రమ్‌రెడ్డిని, అధికారులు, ప్రజాప్రతినిధులను మెప్మా సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను ఇచ్చిన మాట ప్రకారం 3వ విడత వైఎస్‌ఆర్ ఆసరా నగదు మహిళల ఖాతాల్లో జమ చేశారని, ఎన్ని కష్టాలు ఎదురైన ఇచ్చిన మాట ప్రకారం జగనన్న అందరికీ సంక్షేమ పథకాలను వర్తింపచేస్తున్నారన్నారు. మహిళలు ఆర్థికంగా బలవంతులుగా మారి తమ కుటుంబాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ ఆసరా వారోత్సవాల్లో భాగంగా మహిళలు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ కరుణకుమారి, మున్సిపల్ చైర్‌పర్సన్ గోపారం వెంకటరమణమ్మ, మున్సిపల్ కమిషనర్ ఎం.రమేష్ బాబు, మెప్మా పిడి డి.రవీంద్ర, వైసిపి పట్టణ కన్వీనర్ అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, జెడ్‌పిటిసి డాక్టర్ సిహెచ్ ఆదిశేషయ్య, సిండికేట్ ఫార్మర్ సొసైటీ చైర్మన్ నాగులపాటి ప్రతాప్‌రెడ్డి, వైసిపి నాయకులు ఇందూరి వెంకటరమణారెడ్డి, నోటి వినరుకుమార్ రెడ్డి, కౌన్సిలర్లు, మెప్మా సిఒ మాధవి, మెప్మా సిబ్బంది, పొదుపు మహిళలు పాల్గొన్నారు.










