ఒక ఉదయం తొంగిచూచే లోపు
కొన్ని హృదయాలు మట్టిలో
ఓ చెట్టు కొమ్మన వేలాడుతూ విప్పారుతాయి
ఉషోదయపు కాంతులీనుతూ...
నూతనోత్తేజపు మంచు బిందువులను
తనలో ఇముడ్చుకుని
జీవన్మరణపు కదలికల తాడుపై చైతన్యంతో
సామూహికంగా సాహసపు అడుగులు తొక్కుతూ
పలుకుతాయి పక్కున ...
అజరామరమైన ఓ ప్రకృతి బంధువా
ఏ వ్యథల వాసనలను చవిచూచి
మనపై ఉసిగొల్పికుంటిమో ...
పోరాట వనాల జ్ఞానోదయపు చక్రాలను
ఇక ప్రసరించుకుందామా..!
మనల్ని మనం మానవత్వపు
మెరుపు వంతెనలపై పడుకోబెట్టుకుని
చోద్యం చూడక
కర్మ గీతికలను వెల్లువతో చివరివరకూ
పాడే అవకాశం కల్పించుకుంటూ లేస్తూ...
ఒక హితం కోసం కదా ఈ సందేశం!
వ్యక్తిగతం కానే కాదు
అస్తిత్వం యొక్క ప్రశ్నార్థకపు అలుపు అసలే కాదు
ఇది సత్యాన్ని వక్రీకరించి ఖూనీ చేసే
అజ్ఞానాంధకారపు వాక్కులకు ఇక తాళం కదా...
ప్రశ్నిస్తూ స్పష్టంగా సమానంగా బాధ్యతగా అక్కరతో
పరిమళించమనే కదా తాత్పర్యం!
- రఘు వగ్గు
96032 45215










