May 30,2022 07:20

మే పువ్వు మేలోనే పూస్తుందని కాదు కాని
మేడేతో మొదలౌతుందనే గుండెకింత సందడి
పూల రుతువు కాలుమోపిన తర్వాతే కదా
పరిమళాల జాతర ప్రారంభమౌతుంది
చెమట చిత్తడి దేహం నిండా సుగంధాలు విరబూసేది
ఆకాశం దాహం తీర్చుకోను మేఘమాలగా
సముద్రాలను ముద్దు పెట్టుకుంటూ
మట్టిపైన స్వాతిచినుకుల వాన కురిపించేది
చినుకుల అక్షరాలతో ధరిత్రి యెదపైన
సుదీర్ఘ ప్రేమలేఖ రచించేది
చిటపట చినుకుల తాళంతో పల్లవించిన
శెనగచేనుపైన తెల్ల దుప్పటి కప్పి
రాత్రి కాసిన వెన్నెలని సిరకాగా పిండుకునేది
పూబాలలు చిరునవ్వుల నిషాతో అందించిన
మధువును తేనెటీగలు తనివితీరా ఆస్వాదించేది
డస్సిన ప్రకృతి ఉసూరుమంటున్న వేళ
మాయలేడి మరీచిక అలనల్లన యేమారుస్తూ
మొసలి కన్నీటితో చల్లబెడుతూ వుండేది
ఎవరు నిలబెట్టిన కాపలాదారులో రహదారి కిరువైపుల
చిక్కటి నీడలతో కొమ్మల చేతులు చాచి పిలుస్తుంటాయి
ఈ రుతువులోనే ఇంకిపోయిన ఏరులాంటి ఆశల కళ్ళలో
మేఘాలు వరద కలల్ని పొదుగుతుంటాయి
మే అంటేనే మల్లెల మత్తు వాసనల మైమరపులు
మే అంటేనే కొత్తకలలు మొలకెత్తే వూసులు
అందుకే మేలో నేను మైమరచి మమేకమౌతాను
ఎందుకంటే అమ్మ నన్ను కన్నదీ మే నెలలోనే కదా!

- డాక్టర్‌ పెరుగు రామకృష్ణ
98492 30443