Feb 03,2023 22:12

ట్రాక్టర్‌ద్వారా తరలిస్తున్న కలప

ప్రజాశక్తి - రొద్దం : మండలంలో చెట్లు నరికివేతకు గురవుతున్నాయి. మహావృక్షాలను సైతం పట్టుపగలే నేలమట్టం చేసి లక్షలాదిరూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఓ చెట్టును నరకాలంటే అనేక నిబందనలు ఉన్నాయి. అటవీశాఖ అధికారులతో అనుమతి తప్పని సరి. కాని ఏ అనుమతి లేకుండానే వందల సంఖ్యలో చెట్లు నేలమట్టం చేస్తున్నారు. ప్రతిరోజు మండల కేంద్రం మీదుగానే యథేచ్ఛగా ట్రాక్టర్ల ద్వారా పెద్దపెద్ద వృక్షాల కలపను ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పూట కూడా పోలీస్‌ స్టేషన్‌ మీదుగా పెనుకొండ పావగడ ప్రధాన రహదారిలో తరలిస్తున్నారు. వీటిని కట్టెల కోత మిషన్ల వద్దకు తీసుకువెళ్లి సొమ్ము చేసుకుంటున్నారు. అలాగే ఇటుక పట్టీల వద్ద ఇటుకను కాల్చేందుకు కట్టెలను వినియోగిస్తున్నారు. ఇటు ఇటుక బట్టీలు మొదలు కట్టెల కోత మిషన్ల వరకు అటవీశాఖ అదికారులు ప్రతి నెల మాముళ్లు తీసుకుంటూ మిన్నకుంటున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ట్రాక్టర్‌ద్వారా యథేచ్ఛగా కలప తరలిస్తుండగా 'ప్రజాశక్తి' ఫోటోలు తీస్తుండగా విషయం తెలుసుకున్న పోలీసులు కంటితుడుపు చర్యగా ఆ ట్రాక్టర్‌ను సీజ్‌ చేశారు. అయితే రోజు కలపతరలిపోతున్న పట్టించుకోలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైన అటవీశాఖ ఉన్నత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.