పిల్లాడికి తల్లిపాలు ఎంత శ్రేష్ఠమో మనిషికి మాతృభాష అంతే శ్రేష్ఠం.చంటిపిల్లాడు పసితనంలో నేర్చుకునే భాష మాతృభాష. బిడ్డకు తొలి బడితల్లి ఒడే. తన తల్లిని ఎవరూ చెప్పకుండానే అమ్మా అని బిడ్డ ఎలా పిలుస్తాడో, మాతృభాష కూడా అంతే. ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతంలో మాట్లాడే భాష వారికి మాతృభాష అయితే, మనకు మాతృభాష తెలుగు అవుతుంది. తల్లి అంటే ఎంత గౌరవం ఉంటుందో, మాతృభాషకు కూడా అంతే గౌరవం ఇవ్వాలి. ఎవరి అమ్మవారికి గొప్పది ఎలాగో, ఎవరి భాష వారికి గొప్పది. మాతృభాష లేనిదే మానవ జాతి వికాసం లేదు. మనిషి ఎన్ని భాషలు నేర్చినప్పటికి మాతృభాషలో ప్రవీణుడు కానివాడు విజ్ఞాన సమపార్జన చెయ్యలేడు. మాతృభాష మనకు ఎందుకు గొప్పదంటే, మన సంస్క ృతి, ఆచారం, కుటుంబ పద్ధతులు అన్నీ మాతృభాషలోనే మనకు పరిచయం అవుతాయి. మనిషి తన వ్యక్తిత్వ జీవన పరమార్థిక విషయాలను మాతృభాషలో అర్థం చేసుకున్నట్టుగా మరొక భాషలో అంత సులభంగా అర్థం చేసుకోలేడు. జీవితంలో పైకి ఎదగాలంటే ఇతర భాషలను నేర్చుకోక తప్పదు. వాటిని నేర్చుకోవడంలో ఎటువంటి తప్పూ లేదు. కానీ వాటి ప్రభావం మాతృభాషపై చిన్నచూపుగా మారకూడదు. మన మాతృభాషను మనమే రక్షించుకోవాలి.
'దేశ భాషలందు తెలుగు లెస్స' అని అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు భాషలోని మాధుర్యం, గొప్పతనం ఇక ఏ భాషలోనూ లేదని చాలా మంది కవులు చెప్పారు. అలాగే వెనీసుకు చెందిన వర్తకుడు నికొలో డా కాంటి భారతదేశం గుండా ప్రయాణిస్తూ, తెలుగు భాషలోని పదములు ఇటాలియన్ భాష వలె అచ్చులు చివరన కలిగి ఉండటం గమనించి తెలుగును 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్' అని కొనియాడారు.
దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రజల వ్యవహారిక భాష తెలుగు చాలా తీయనిది. తెలుగు వ్యాకరణం చాలా సులభం. సంస్క ృతంలో ఉన్న వైభవం తెలుగులో కూడా ఉంది. తెలుగుని 12 కోట్ల తెలుగువాళ్లు, ప్రపంచం నలుమూలలా వ్యాపించి ఉన్న కోట్ల మంది తెలుగు వాళ్ళు మాట్లాడతారు. భారత దేశంలో ప్రాచీన హౌదా పొందిన భాషల్లో తెలుగు ఒకటి. నన్నయ, తిక్కన, ఎఱ్ఱన, శ్రీనాధుడు, తెనాలి రామకృష్ణ కవి, ముక్కునంది తిమ్మన, తిరుపతి వెంకట కవులు, వేమన, బమ్మెర పోతన లాంటి మహామహులు తెలుగులో అనేక రచనలు చేసి జాతి గౌరవాన్ని, భాషస్థాయిని ఆకాశానికి పెంచారు.
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన నిర్వహించాలని యునెస్కో 30వ సాధారణ మహాసభ ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ఏటా మాతభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్ జనరల్ ప్రకటిస్తూ వస్తున్నారు. దానికి కారణ నేపథ్యమేమిటంటే ... బంగ్లాదేశ్ దేశ విభజన తర్వాత బంగ్లాదేశ్‌ను తూర్పు పాకిస్థాన్‌గా పిలిచేవారు. వారి మాతృభాష బెంగాలీ. కానీ ఆనాడు వారి భాషకు తగిన గుర్తింపు లేదు. అందుకే, తమ భాషకు తగిన గుర్తింపు ఇవ్వాలని అక్కడి ప్రజలు ఉద్యమ బాట పట్టారు. ఆ ఉద్యమం 1952 నుంచి నాలుగేళ్లపాటు సాగింది. అనేక మంది విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులంతా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. దీన్ని అణచివేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఆ మేధావుల్ని, అధ్యాపకులను జైళ్లలో వేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం వారి విన్నపాన్ని తిరస్కరించటమే కాకుండా ఫిబ్రవరి 21న పోలీసు కాల్పులు జరిపించింది. మాతృభాష కోసం మొదలుపెట్టిన ఆ ఉద్యమంలో నెత్తురు ఏరులై పారింది. మాతృభాష పరిరక్షణ కోసం నలుగురు యువకులు అసువులు బాశారు. చివరికి దిగొచ్చిన పాక్ ప్రభుత్వం 1956లో బెంగాలీ, ఉర్దూ భాషలను అధికార భాషలుగా గుర్తించింది. 1953 నుంచే బంగ్లాదేశ్ ప్రజలు ఫిబ్రవరి 21ని మృతవీరుల దినోత్సవంగా జరుపుకొంటున్నారు. ఆ దేశ అభ్యర్థన మేరకు యునెస్కో ఆ రోజునే మాతృభాష దినోత్సవాన్ని ప్రకటించింది. దీనికి భారత్, పాకిస్తాన్ సహా 28 దేశాలు మద్దతిచ్చాయి.
ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్క ృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతోంది. బంగ్లాదేశీయులు చేసిన భాషా ఉద్యమానికి నివాళిగా ప్రతియేటా ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. బహుభాషల విధానాన్ని ప్రోత్సహించాలని, అది విశాల దృష్టిని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తుందని యునెస్కో ప్రకటించింది. అయితే మాతృభాషను కాపాడుకుంటూ, ఇతర భాషల్ని నేర్చుకొని, అనంత విజ్ఞానాన్ని పొందడాన్ని యునెస్కో ప్రోత్సహిస్తోంది.
తెలుగు గొప్ప భాష
తెలుగు పదాలకు శాతవాహనుల కాలం నుంచి గుర్తింపు ఉంది. పోరాడి ఉద్యమించి సాధించుకున్న ప్రాచీన హౌదా తెలుగు భాష అభ్యుదయానికి మూలస్తంభం కావాలి. ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు ఇతర ప్రపంచ భాషలతో ముఖ్యంగా ఆంగ్లంతో సమానమైన పదజాలం లేకపోవటం వల్ల పొందుతున్న నష్టం తెలుసుకోవాలి. ప్రాచీన హెరీదా కేవలం తెలుగు జాతికే పరిమితం కాకుండా, అంతర్జాతీయ స్థాయిని అందుకోవటం వైపుగా కృషి జరగాలి. తెలుగు జాతి, భాష సాహిత్యం, చరిత్ర, సంస్క ృతి ప్రపంచ సాహిత్యానికి తెలియవలసిన అవసరం ఉంది. తెలుగు పద్యం, పాట, గేయం ప్రపంచానికి తెలియాలి. తెలుగు భాష మాధుర్యం ప్రపంచ ప్రజల నోళ్ళల్లో నానాలి. మాతృభాష విషయంలో అనుకరించాల్సిన వైఖరిని గురించి మనం స్పష్టంగా తెలుసుకోవాలి.
అందరూ ఇంగ్లిష్‌లో వున్నన్ని మాటలు మరే నుడిలో లేవని అంటారు కానీ తెలుగులో వున్నన్ని మాటలు మరే భాషలో లేవు. తెలుగులో ఎక్కువ మాటలు ఉండటానికి ఒక కారణముంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు చాలా ఎక్కువ ప్రాంతాల్లో వ్యాపించి ఉంది. ఎప్పుడూ ఒకే రాజ్యంగా లేదు. అందుకని వేరు ప్రాంతాల్లో ఉన్న వారు ఒకే విషయాన్ని వేరు వేరు మాటలలో చెప్పుతారు. కాబట్టి మరే భాషలో ఉండటానికి వీలులేనన్ని మాటలు తెలుగులో ఉన్నాయి. ఉదాహరణకు వ్యంగ్యం అన్న ఒక్క మాటకు తెలుగులో ఎత్తిపొడుపు, ఎగతాళి, ఎద్దేవా, దెప్పుళ్ళు, గేలి, వెటకారం, హేళన, విడంబరం అని పర్యాయార్ధాలు ఉన్నాయి. శతకాలు, పద్యాలు కేవలం తెలుగు భాషలోనే ఉన్నాయి. నేలమీద మొత్తం 6,500 దాకా భాషలుంటే అందులో 5 మాత్రమే అజంత భాషలున్నాయి. వాటిలో తెలుగు ఒకటి.
మాతృభాషలకు ముప్పు
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మాతృభాషలు అంతర్థానమయ్యే స్థితిలో ఉన్నాయి. ప్రపంచంలో ఇప్పటికే సుమారు 230 భాషలు అంతరించాయని, ఇంకా 3 వేల భాషలు అంతరించే దశలో ఉన్నాయని యునెస్కో వెల్లడించింది. ఒక భాషను మాట్లాడే జనాభాలో 30 శాతం మంది ఆ భాషను చదవకుండా, తల్లి భాషకు దూరమైతే ఆ భాష కాలక్రమంలో మృతభాషగా మారుతుందని యునెస్కో సూత్రీకరించి, తెలుగుకు ఆ పరిస్థితి రాబోతుందని ప్రకటించింది. ఇది తెలుగు భాషాభిమానులను కలవరపర్చే విషయం.
నలభైకి పైగా భాషలు, మాండలికాలు భారతదేశంలో అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి. ఈ భాషలన్నీ ప్రమాదస్థాయిలో ఉన్నాయి. నీతి, నియమాలు, నడవడిక నేర్పే మాతృభాషలు అంతరిస్తే, మానవ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. సైన్స్, కంప్యూటర్, గణితం ఇలా ఏ సబ్జెక్టు కూడా మంచి చెడుల గురించి చెప్పవు. మంచి, చెడు విడమరిచి చెప్పేది మాతృభాష ఒక్కటే. అలాంటి మాతృభాష అంతర్థానమైతే.. మన మనగడే ప్రశ్నార్థకం అవుతుంది.
తెలుగు ఆధునీకరణ జరగాలి. సమకాలీన అవసరాలకు తగ్గట్టుగా మార్పులతో కూడిన సాహిత్యం రావాలి. సమకాలీన జ్ఞానాన్ని మన భాషల్లోకి అనువదించుకోవాలి. ఆ విధంగా భాషని అభివృద్ధి పథంలోకి తీసుకురావాలి. భాష కేవలం భావాలు వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సాధనమే కాదు, ఒక జాతి ఉనికిని, సంస్కృతికి భాష మూలాధారం. భాష అంతరించిందంటే.. ఆ భాష మాట్లాడే సమూహం అంతరించినట్లేనని భావించాలి. నిజమైన భావ ప్రేరేపణ, ప్రగతి, మాతృభాష వల్లనే వస్తుందని, స్వభాషలో విద్య ఉంటే, స్వరాజ్యం ఎప్పుడో వచ్చేదని గాంధీజీ 1938లోనే చెప్పారు. ఇతర భాషల కన్నా మాతృభాషలో నేర్చుకోగల సామర్ధ్యం ఎవరికైనా ఎక్కువగా వుంటుందని నిపుణుల మాట. మాతృభాషలో విద్యను బోధిస్తే మానసిక వికాసానికి, సంపూర్ణ మూర్తిమత్వానికి దోహదం చేస్తుంది. అందుకే మాతృభాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి పరమావధి కావాలి. సుసంపన్నమైన మన భాషా సాహిత్య సౌందర్యాన్ని అవగాహన చేసుకోవడం, మన భాషను, సంస్కతినీ కాపాడుకోవడం, భావి తరాలవారికి దీన్ని అందించడం ఆ భాషా సౌందర్య సంపదను కాపాడటం మన అందరి కర్తవ్యం.
- రేగుళ్ళ మల్లికార్జున రావు
సంచాలకులు, భాషా సాంస్క ృతిక శాఖ
94916 59899










