ఎక్కడివీ రాతలు?
ఎవరిది ఈ కలం?
రకానికో రంగుతో
రంగుకో అర్దాన్ని
పులిమే రచనలో
ఆవిరైన కాలమెంతో?
సెగలు తొక్కుతూ
ఖర్చయిన సిరా ఎంతో?
ఎంతో లోతులో చేతులు
ఎంతో అందంగా... కొంత హీనంగా
ఎంతో గర్వంగా... కొంత గుడ్డిగా
మలిచే మలుపులో మెలతిరిగి
పాళీకి నిద్ర లేకుండా చేసి
ఎర్రని కళ్ళ సెగల తునకలు
రాలిన చోట పదునుగా
అవలీలగా మానవాళి నుదురును పాకి
ఎడారి ఊహలను చిత్తడి ఒత్తిళ్లను
కాలం గొంతులో సరికొత్త రాగాన్ని పోసి
బతుకు నాట్యంలో గమకాలతో
మనిషికి దప్పిక తీరే విచిత్ర రచనలో
మనుగడ అనూహ్యంగా
తుళ్ళే ఆనందంతో పాటు
ముల్లై అనుభావాల్ని
ఎన్నిటినో పుట్టించే
చిత్రాలకు జన్మనిచ్చిందో?
ఆలోచించేకొద్ది
ఎవరికి వారే తుంచుకుని బతికే
పిలకల పచ్చదనమే జీవితం...
- చందలూరి నారాయణరావు
83094 63567










