Jun 06,2022 06:51
vera raju

చిత్రకారుడిగా, కవిగా, నవలా రచయితగా బహుముఖ ప్రజ్ఞావంతుడైన శీలా వీర్రాజుగారు జూన్‌ 1వ తేదీన తన 83వ ఏట హైదరాబాద్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. రచయితగా, చిత్రకారుడిగా లబ్ధ ప్రతిష్టులైన శీలా వీర్రాజు ఏబై ఏళ్ళ క్రితమే లేపాక్షిని సందర్శించి అక్కడి శిల్పాలకు స్కెచ్‌లు వేశారు. వాటిని 1990లో పుస్తకంగా ప్రచురించారు. 'శిల్పరేఖ' పేరుతో 1990లో ప్రచురించిన లేపాక్షీ స్కెచ్‌ బుక్‌లో ముందుమాటను ఆయనకు నివాళిగా అందిస్తున్నాం.

1968లో మే మాసపు వడగాల్పుల్లో మా జీపు అనంతపురం నించి హిందూపురానికి బయల్దేరింది. జీపులో నేనూ, గోపాలశాస్త్రి కాక మరో ముగ్గురు వున్నారు. వారిలో ఒకరు ఫొటోగ్రాఫర్‌. మరొకరు ఆర్టిస్టు. లేపాక్షి, తాడిపత్రి తదితర ప్రాంతాల్ని చూసి ఆంధ్రప్రదేశ్‌ పత్రికలో ఇంగ్లీషులో గోపాలశాస్త్రి, తెలుగులో నేనూ వ్యాసాలు రాయడం కోసం ఫొటోగ్రాఫర్నీ, ఆర్టిస్టుని వెంటబెట్టుకుని, మాతోపాటు వస్తానన్న మరో ఆఫీసర్ని కలుపుకుని హైదరాబాదునించి బయల్దేరాం. అందరమూ సమాచారశాఖ ఉద్యోగులమే. ఉద్యోగరీత్యా నేను అసిస్టెంట్‌ ట్రాన్స్‌లేటర్నే అయినా, చిత్రకళ మీద నాకున్న అభిరుచి కారణంగా ప్రత్యేకంగా ఒక స్కెచ్‌బుక్‌ పట్టుకుని బయల్దేరాను నేను.
హైదరాబాదు నించి బయల్దేరి దారిలో ఓ రాత్రి ట్రావెలర్స్‌ బంగళాలో బసచేసి, పొద్దున్న మళ్ళీ బయలుదేరి మధ్యాహ్నానికి అనంతపురం చేరుకున్నాం. జిల్లా కార్యాలయంలో గడిపి కాస్త ఎండ తగ్గగానే హిందూపురం చేరుకున్నాం. లేపాక్షిలోని వీరభద్రేశ్వరాలయం చాలా కాలంగా అలక్షింపబడి శిథిలావస్థకు చేరుకుంది. భిక్షకులు ఆలయ ప్రాంగణంలో నివాసం వుంటూ కట్టెలతో వంటలవీ చేసుకోవడంవల్ల స్తంభాలూ, గోడలూ పొగచూరిపోయాయి. కుడ్యచిత్రాలపై సున్నం వేసేయడం వల్లా, పొగచూరి మసిబారిపోవడం వల్లా చాలా కుడ్య చిత్రాలు పాడైపోయాయి. గోడలు పడిపోయీ, రాళ్ళు ఊడిపోయీ, శిల్పాలు దెబ్బ తినీ సరైన ఆలనా పాలనా లేకుండా వున్న లేపాక్షి వీరభద్ర ఆలయాన్ని గురించి కల్లూరి సుబ్బారావు గారు పట్టించుకుని అధికార్ల దృష్టికి తెచ్చి, పత్రికల ద్వారా ప్రచారం చేసి, పెద్దలను కలిసి మాట్లాడి ఆ ఆలయాన్ని సముద్ధరించ డానికి విశేషంగా కృషి చేశారు. ఆ విషయాలన్నీ ఆయన మాతో చెప్తూ 'లేపాక్షి గురించి నేను చెప్పడం కాదు, మీరే చూస్తారుగా, వెళ్ళిరండి' అని సాదరంగా వీడ్కోలు పలికారు.
హిందూపురం నించి చాలా దగ్గరే. పది మైళ్ళు. చూస్తుండగానే మా జీపు పొలాల పక్క 'మట్టి రోడ్డులో ఎర్రని దుమ్మును లేపుకుంటూ లేపాక్షి గ్రామాన్ని చేరుకుంది. ఊరు చాలా చిన్నది. ప్రభుత్వం కొత్తగా ఒక టూరిస్ట్‌ గెస్ట్‌ హౌస్‌ కట్టించింది కాని ఇంకా ప్రారంభం కాలేదు. అప్పట్లో అది మా శాఖ కిందే వుండేది గనుక అందులో సామాను పడేసి స్నానం చేసీ చేయనట్లు వొళ్ళు తడుపుకుని ఆలయానికి చేరుకున్నాం. సూర్యుడు ఆలయం వెనక ఇళ్ళ కప్పుల కిందకు కుంగిపోతున్నాడు. ఆకాశంలో పరుచుకున్న ఎర్రరంగు కొద్దిగా వెలుతుర్ని ఆలయ ప్రాంగణంలోకి కుమ్మరిస్తోంది. స్థానికంగా వున్న మా శాఖ అధికారి ముందుగా చెప్పడం వల్ల పూజారి మా కోసమే ఎదురుచూస్తూ ఉన్నాడు. అందరూ దైవ దర్శనంలో మునిగిపోయారు. నేను రంగమండపంలో చిరు వెలుగుల్లో నా చుట్టూ పరివేష్టించి వున్న దేవతామూర్తుల మధ్య ఒక్కడ్నే నిలబడిపోయాను. కొబ్బరి ముక్క ప్రసాదం పట్టుకొచ్చి మా వాళ్ళు నా చేతిలో పడేశారు- దేవుడంటే భక్తి శ్రద్ధా లేదు, వట్టి నాస్తిక వెధవ్వి నువ్వు అన్నట్టు నా వైపు చూసి.
నిజమే, అక్కడ నేను దేవుడ్ని చూడలేకపోయాను. ఆ దేవుడ్ని చెక్కిన, చిత్రించిన శిల్పుల, చిత్రకారుల ప్రతిభల్ని మాత్రమే చూడగలిగాను. అక్కడున్న ఆ రెండు రోజులూ, వచ్చిన రోజుకాక మర్నాడు, ఆ మర్నాడు పొద్దున్నే దేవాలయానికి రావడం, మధ్యాహ్నం వరకూ స్కెచ్‌లు గీసుకోవడం, భోజనానికి వెళ్ళి వచ్చి సాయంత్రం వరకూ మళ్ళీ స్కెచ్‌లు వేసుకోవడం, మధ్య మధ్య పూజారిని అడిగి అక్కడి శిల్పాల వివరాలు తెలుసుకోవడం, రాత్రి గెస్ట్‌హవుస్‌కి వచ్చి భోజనం కాగానే గోపాలశాస్త్రి జోకాభిరామాయణంలో మునిగిపోవడం, రాత్రి కలలు కనాలనుకొంటూనే వొళ్ళు నొప్పుల్లో తెలివి లేకుండా మత్తుగా నిద్రపోవడం .. అలా గడిచిపోయాయి మిగతా రెండ్రోజులూ. ఆ రెండ్రోజుల్లోనూ రంగమంటపం, కల్యాణ మంటపాల్లోని ఇంచుమించు అన్ని పెద్ద శిల్పాల స్కెచ్‌లూ వేసుకున్నాను. వీటిలో తుడుపులకు, దిద్దుబాట్లకూ అవకాశం లేదు. ఆ రెండ్రోజుల్లో దాదాపు యాభై స్కెచ్‌లు గీసుకున్నాను. దేవాలయ చరిత్రను గురించీ, శిల్పాలను గురించీ పూజారి చెప్పిన వివరాలను నోట్‌ చేసుకున్నాను. మాతో వచ్చిన ఆర్టిస్టు రమణ కూడా తన స్కెచ్‌ పుస్తకం నింపేశాడు. ఫొటోగ్రాఫర్‌ జగదీశ్వర్‌ ఒక్క రోజులోనే అన్ని ఫొటోలూ తీసేసుకుని గోపాలశాస్త్రితో మంటపం అరుగుమీద కబుర్లు చెప్పుకుంటూ కూర్చుని, అడపాతడపా పూజారిని అడిగి కొబ్బరి చెక్కల ప్రసాదం తెచ్చియిస్తుండేవాడు.
లేపాక్షిని చూడడానికి వచ్చే సందర్శకులు ఎక్కువగా బెంగుళూరు నించే వస్తుంటారు. తెలుగు టూరిస్టులు బహు తక్కువే. చుట్టుపట్ల గ్రామాల వాళ్ళు ఎప్పుడైనా వచ్చినా దేవుడికి ఓ కొబ్బరికాయ కొట్టి, ఓ నమస్కారం పెట్టుకోడానికి వచ్చేవారే. ఇక్కడొక గొప్ప శిల్పం ఉన్నదనీ, అద్భుతమైన చిత్రలేఖనం ఉన్నదనీ చూసిపోదామనే కళాత్మక దృష్టితో చాలా తక్కువమందే వచ్చేవారు. కొంతమంది విదేశీ పర్యాటకులు కూడా వచ్చారు. వారంతా బస్సుల్లోనో, టేక్సీల్లోనో బెంగుళూరునించి వచ్చినవారే. బెంగుళూరు అక్కడికి దగ్గరే. లేపాక్షి బసవయ్య నిజంగానే గొప్ప శిల్పం. తెలుగు పౌరుషానికి అది ప్రతీక. ఎంతో హుందాగా, నిండుగా ఒంటినిండా ఆభరణాలతో అద్భుతమైన చెక్కడపు పనితనంతో వీరభద్ర ఆలయానికి అల్లంత దూరంలో ఊరి మధ్య ఠీవిగా కూర్చునివున్న ఆ ఏకశిలా నంది విగ్రహం దానికదే సాటి. బెంగుళూరులోని బసవనగుడి నంది కన్నా, ఆ దగ్గరలోని నంది హిల్స్‌ పైవున్న నంది కన్నా లేపాక్షి నంది బహుశా పెద్దది కావొచ్చు. అలాగే వీరభద్ర ఆలయంలోని నాగలింగం కూడా చాలా పెద్దది.
లేపాక్షి ఆలయ శిల్పాలకు వాడిన రాయి కొన్నిటికి నల్ల సేనావు రాయి. అదే బ్లాక్‌ గ్రానైట్‌, మరికొన్నిటికి ఇసుకరాయి వాడారు. గ్రానైట్‌ రాయి ఉలికి ఒక పట్టాన లొంగని గట్టిరాయి. అయినా, శిల్పులు ప్రతి విగ్రహాన్ని ఆభరణాలతో, అలంకారాలతో చాలా వివరంగా చెక్కారు. కుడ్యాల మీదా, స్తంభాల మీదా హంసలు, లతలు వంటి మోటిఫ్‌లు కూడా చాలా చక్కగా చెక్కారు. నేను అక్కడి శిల్పాలకు మాత్రమే స్కెచ్‌లు గీసుకున్నాను. గోడల మీదా, సీలింగు పైనా రంగుల్లో చిత్రించిన పురాతన చిత్రాలు కూడా ఉన్నాయి. అచ్చమైన దేశీయ శైలి చిత్రాలవి. నేను వాటి జోలికి పోలేదు. సమయం చాలకపోవటం ఒక కారణమైతే, తీసుకెళ్ళిన స్కెచ్‌బుక్‌ పూర్తయిపోయి, ఆ పల్లెటూళ్ళో డ్రాయింగు పేపర్లు దొరక్కపోవడం మరో కారణం. నాలుగోరోజు ఉదయమే అక్కడినుంచి తిరుగు ప్రయాణం కట్టాం. తిరిగి వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్‌ పత్రికలో లేపాక్షిమీద ఓ వ్యాసం రాశాను. మా ఫొటోగ్రాఫర్‌ తీసిన కొన్ని ఫొటోలూ, నేను వేసిన ఒకటో రెండో చిత్రాలూ అందులో వాడుకున్నాం.
1968 జూలైలో బెంగుళూరులోని చిత్రకళా పరిషత్‌ వారి పిలుపు మేరకు విధాన సౌధలో వారం రోజులపాటు జరిగిన చిత్రకళా ప్రదర్శనలో పాల్గొని లేపాక్షి స్కెచ్‌లను ప్రత్యేక విభాగంగా ఏర్పాటు చేసి ప్రదర్శించాం. 1969 ఏప్రిల్లో హైదబాదులోని కళాభవన్లో భారత కళా పరిషత్‌ సహకారంతో ఈ లేపాక్షి స్కెచ్‌ ప్రదర్శన వారం రోజులపాటు ఏర్పాటు చేశాం. 1970 జనవరిలో పశ్చిమ జర్మనీలోని గోటింజెన్‌ నగరంలో అక్కడి విశ్వవిద్యాలయంలో భారతీయ తత్వశాస్త్రంపై డాక్టరేట్‌ చేస్తోన్న డి.శ్రీధరబాబు చొరవతో ఇండియన్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ వారు ఈ లేపాక్షి చిత్రాల ఒన్‌ మాన్‌ షోను వారం రోజులపాటు నిర్వహించారు.
అప్పటినుంచి ఈ స్కెచ్‌లతో ఒక పుస్తకాన్ని అచ్చు వేయించాలనే ఆలోచన ఉండేది. చాలా మంచి ఆలోచన, తప్పక అచ్చు వేయమని నాకు అత్యంత ఆప్తుడైన కె.వి.ఎస్‌. సూర్యనారాయణ రాజు ప్రోత్సహించాడు. ఏడెనిమిదేళ్ళ క్రితం సికింద్రాబాదులో ఒక రోడ్డు ఏక్సిడెంట్లో సతీసమేతంగా ఆయన మరణించి వుండకపోతే ఈ పుస్తకం, ఆయన ప్రోత్సాహం వల్ల, ఎప్పుడో అచ్చయివుండేదే. చిత్రాలు గీసిన ఇరవై రెండేళ్ళకు అచ్చవుతోన్న యీ పుస్తకాన్ని ఆ మిత్రుడికే అంకితం ఇవ్వడం నా స్నేహధర్మంగా భావిస్తున్నాను. ఈ పుస్తకం వెలుగుచూస్తే ఆనందించే మిత్రులు దివి శ్రీధరబాబు, మాజేటి రాజాజీగార్లు ఈనాడు లేరు. ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకోకుండా ఉండలేను.