వీధి వీధిలో సందు సందులో
అడుగు తీసి అడుగేస్తే చాలు
అన్నీ పుట్టలే
దేశమంతా పుట్టలు మొలిచాయి
లేత జేగురు రంగులో తళతళా మెరుస్తూ పుట్టలు
పుట్టలోని పాము సుస్పష్టం
నీళ్లు తాగే దగ్గర గాలి పీల్చే దగ్గర
అక్షరాలు దిద్దే దగ్గర
ఇక్కడా అక్కడా అనేముంది
ఎక్కడపడితే అక్కడ పుట్టలే పుట్టలు
పుట్టలనిండా పొంచి వున్న పాములు
నీటిని ముట్టినా మట్టిని తాకినా
గాలిని పీల్చినా బుసకొడుతున్నాయి
కసిగా కాటేస్తున్నాయి
రాయిని శిల్పంగా మలవాల్సినవాడే
బండరాయవుతాడనీ
శిల్పానికి ప్రాణం పోయాల్సినవాడే ప్రాణం తీస్తాడని
పాపం పసివాడికెలా తెలుస్తుంది
మనిషిగా తీర్చిదిద్దాల్సిన వాడే
కులం కుబుసం విడిచిన పామై కసిగా కాటేస్తాడని
పాపం వాడికేం తెలుస్తుంది!
ఎండుతున్న గొంతుతో నీటిని ముద్దాడాడు
నీటిని చుట్ట చుట్టుకుని
చదువు చెప్పే దుస్తుల్లోనూ ఒక పాముంటుందని
పసివాడెలా గ్రహించగలడు
లోపలా బయటా శుభ్రం చేసే నీటికీ
కులమనే మురికుందని
మురికిని అంటించిన జేగురు రంగు పుట్టుందని
పసితనాన్నీ బలికోరే
బంగారు వన్నె తాచు బసి చేసివుందని
పాపం దాహంతో అలమటిస్తున్న
పసివాడేమి ఊహించగలడు!
నీటి పుట్టలో చేయి పెట్టాడు
కులనాగు కాటుకు గురయ్యాడు
కులం కాటుకు నురగలు కక్కిన
పసివాడి విషాదం సాక్షిగా
పుట్టల్ని పెకలించి పాముల్ని తొలగించే రోజుకోసమే
కాలం ఎదురుచూపు!
- చిత్తలూరి, 8247432521










