చీకట్లో ఉన్నవాళ్లు కదా
వెలుగును చూడటం వాళ్ల తరమవుతుందా?
మనుషులుగా మాయమై
జంతువులుగా సంచరిస్తున్నవాళ్లు
వాళ్లు మనుషులుగా ప్రవర్తించగలరా?
తరతరాల వెట్టిని ప్రోత్సహిస్తూ
వివక్షలని నరనరానా ఇంకించుకుని
ఊరేగుతున్నవాళ్లు
ఉన్నతోన్నతమైన మూర్తిని
తలెత్తి చూడగలిగే దమ్మూ ధైర్యం
వాళ్లకెలా వుంటుంది!
చర్మానికి రంగూ రుచినీ అంటగట్టినవాళ్లు
మనుషులుగా విడదీసి
మతాలుగానో కులాలుగానో చీల్చి
మనిషి మాంసానికి అలవాటుపడ్డవాళ్లు
మనువాదపు మురికి కూపంలో
జలకాలాడుతున్నవాళ్లు
వాళ్లు తేటపడిన మనుషుల్నెలా సహించగలరు!
మనిషి పేరు తప్ప అన్ని పేర్లూ
తమ దేహమ్మీద టాటూలా వేయించుకున్నవాళ్లు
వాళ్లకు మనిషి రూపెత్తిన మహౌన్నతుడి
పేరెలా గిడుతుంది
వాళ్లను క్షమించండి!
మహానుభావా
వాళ్లు తాము మనుషలమన్న సంగతే మర్చిపోయి
చాలా కాలమైంది
వాళ్లు గాలికి, నీటికీ, నిప్పుకూ
సముద్రానికి, నదికి, మేరుపర్వతానికి
కులాన్ని అంటకట్టి
కుళ్లిపోయి నడుస్తున్న జోంబీలు
వాళ్లను క్షమించండి!
నిప్పును అంటుకుని తేటపడే గుణం
వాళ్లలో ఎప్పుడో చచ్చిపోయింది
వాళ్ల జిల్లాలకు కాదు
దేహాల మీద నీ పేరు
పచ్చబొట్టేయించి ఊరేగించాలి
అప్పుడుగానీ
వాళ్లలో ప్రవహిస్తున్న మురికి రక్తం శుద్ధికాదు
మనుషులమన్న స్ప ృహలోకి రారు
మహౌన్నతుడి పాదాలకు
ప్రేమతో నమస్కరించరు
వాళ్లను క్షమించండి
వాళ్లు మనుషులు కాదు
వాళ్లను మనుషులుగా
మలవాల్సింది మనమే!
- చిత్తలూరి
82474 32521










