నిన్న ఆశల చెట్టొకటుందేది
ఇయ్యాల గొడ్డలి కిందబడి
నడిరోడ్డు మీద కూలిపోయింది !
కిరాతక లోకంలో దోసెడు
కన్నీళ్లని దాచుకోండి
కవిత్వమై కురవకండి
కాలాన్ని కాచుకోండి !
కూలిన చెట్టుని ఆవహించిన
అ'మృత' ఆత్మల బృందగీతం
దు:ఖ దేహాల భక్తిపరవశం
ఆకలీ అన్యాయం మరిచిపోయేలా
రియల్ ఎస్టేట్ రాజ్యం నిలిచిపోయేలా !
పచ్చని చెట్టుని నమిలేసిన
పంచలోహ రాళ్ల పదనిసలు
మహానది మీద ఛాతీ
పరుచుకున్న ఇనప మనిషి
స్వేచ్ఛ కోసమంటూ !
మానవ జగత్తునే
మటుమాయం చేసిన బ్రహ్మజ్ఞాని
అజ్ఞానీ నువ్వే దేవుడివంటూ...
అధోలోకం చెవిలో ఊదుతున్న
బతుకు దారాన్ని తెంచిన
సమతాచారి మార్మిక మంత్రం
దైవద్వారం తెరిచేనంటూ !
అన్నీ బ్రహ్మ రాజు అవతారాల్లా
భక్త జనం గుండెల మీదెక్కి
ఊరూరా విగ్రహాల ఆగ్రహ దర్శనం !
అంటరాని ఆత్మగౌరవం ఆర్పేసేలా -
పర మతీయుడు పరుగుతీసేలా !
మెరిసే విగ్రహల్లో
నిద్రపోతున్న ఆత్మలారా
ద్వేషగుహలో దాక్కున్న
నవ నాగరికుల్లారా
సజీవ శిలలార
చప్పరించండి చద్దికుండని
కుళ్ళిపోని అమృతంలా !
దేశమిప్పుడు
శిధిలవృక్షం మీద
మొలిచిన బొమ్మల కొలువు !
అంధకారం మీద
వెలిసిన అధికారదేవుడు
రాజకీయ రణగంటల అర్చనలో
విషమంటల ఉత్సవ ఊరేగింపులో !
మనుషులంటే
ఘనీభవించిన కాలం కాదుగా
కనికట్టుకి మోసపోయే
కట్టు బానిసలసలే కాదులే -
శిధిలాలలో సహజీవనానికి !
ఆగ్రహించే కన్నీళ్ళని
ఏ దైవాధికారం ఆపలేదులే !
శిలారాజ్యం కరిగిపోయేలా
ప్రజాతంత్ర నగరంలో
వానచెట్లని నాటండి !
దాచుకున్న కన్నీళ్ళని
కవిత్వంగా పొంగి పొర్లనీయండి
ఆశావృక్షాలు ఆకాశమంతా పరచుకునేలా !
- కేశవ కుమార్










