మాట్లాడుతున్న కలెక్టర్
జిల్లా అభివృద్ధిలో బ్యాంకర్లు భాగస్వామ్యం
నెల్లూరు:ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలకు విరివిగా రుణాలు మంజూరు చేసి, జిల్లా అభివద్ధిలో బ్యాంకర్లు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జిల్లా సంప్రదింపుల కమిటీ (డి.సి.సి), జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం(డి.ఎల్.ఆర్.సి) కలెక్టర్ చక్రధర్ బాబు అధ్యక్షతన నిర్వహించారు. తొలుత లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీకాంత్ ప్రదీప్ కుమార్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బ్యాంకుల కార్యకలాపాలని వివరిస్తూ, జిల్లాలో వివిధ బ్యాంకులకు సంబంధించి మొత్తం 385 బ్యాంకు బ్రాంచ్ లు పనిచేస్తున్నాయని, గ్రామీణ ప్రాంతంలో 144 బ్రాంచ్ లు, సెమీ అర్బన్ ప్రాంతంలో 102, అర్బన్ ప్రాంతంలో 139 బ్యాంకు బ్రాంచ్ లు పనిచేస్తున్నాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పధకాలకు సంబంధించి, ఆయా బ్యాంకుల వారీగా, బ్రాంచ్ ల వారీగా నిర్ధేశించిన లక్ష్యాలను, సాధించిన ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు- పేదలందరికీ ఇల్లు పథకంలో బ్యాంకులు తప్పనిసరిగా భాగస్వాములై ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను సాధించడంలో కషి చేయాలన్నారు. ఇంటి నిర్మాణాలు వేగవంతం చేసేలా పొదుపు సంఘాల్లోని మహిళలకు వడ్డీ లేని రూ. 35వేలు రుణాన్ని అందించేందుకు బ్యాంకర్లు చొరవ చూపాలన్నారు. ఏప్రిల్ 15 నాటికి సుమారు పదివేల ఇళ్లను పూర్తి చేయలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, ఇందుకు బ్యాంకర్లందరూ సహకరించి లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని కోరారు. అలాగే రైతులకు లబ్ధిచేకూరేలా విరివిగా ఈ వ్యవసాయ సీజన్లో పంట రుణాలు అందించాలని సూచించారు. ముద్ర, టిడ్కో గహాలకు రుణాలు, వ్యవసాయ, విద్య, ఎం.ఎస్.ఎం.ఇ, తదితర రుణాల మంజూరులో లక్ష్య సాధనలో కొన్ని బ్యాంకులు వెనుకబడి ఉన్నాయని, సంబంధిత బ్యాంకులు త్వరగా నిర్ధేశించిన లక్ష్యాలను సాధించేలా కషి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్.బి.ఐ ఏజిఎం హనుమ కుమారి, నాబార్డు డిడిఎం రవి సింగ్, మెప్మా పిడి రవీంద్ర బాబు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుధాకర్ రాజు, మత్స్య, పశుసంవర్ధక శాఖ శాఖ జేడిలు నాగేశ్వరరావు, మహేశ్వరుడు, జిల్లా ఉద్యాన శాఖాధికారి సుబ్బారెడ్డి, ఏపీ ఎం ఐ పి పిడి శ్ర్రీనివాసరావు, ఎన్డిసిసి బ్యాంకు సిఈఓ శంకర బాబు, వివిధ బ్యాంకుల అధికారులు తదితరులు పాల్గొన్నారు.










