Feb 14,2022 06:58

ఈ రోజు వస్తూనే ఉంటుంది
ఈ రోజు
బుగ్గల్లో వేవేల గులాబీ తోటలు
కళ్ళల్లో కోటి ఇంద్ర ధనుస్సులు
పూస్తాయి

ఎన్నాళ్ళగానో గుండెల్లో దాచుకున్న
సుతిమెత్తని రహస్యాలను
ఊసుల దండలుగా గుచ్చి
మెడలో అలంకరించాలని
పెదవుల అంచుల పైనుండి
చెవుల్లోకి తేనెజలపాతాలై ఉరకాలని
ఒక ఆరాటం
లోపల ఆరడి పెడుతుంది!

లేలేత ఉదయాలలోనో
ముదిరిన మధ్యాహ్నాలలోనో
చల్లని సాయంకాలలోనో
హృదయాలు ఒకదాని ఎదుట మరొకటి
పురి విప్పి ఆడతాయి

కొన్ని తియ్యని సంగతులు
పిల్లకాలువలై పరుగులు తీస్తూ
అందంగా పుష్పిస్తాయి
ఎదల నిండా నదీ ప్రవాహాలు
పరవళ్ళు తొక్కుతూ సందడి చేస్తాయి

మరికొన్ని చేదు మాత్రలు మింగగానే
ముఖాలపై కాలకూట విషాలను
అసహ్యంగా వర్షిస్తాయి
కుత్తుకలపై కత్తులు
పదునుగా నూరుతాయి

భవిష్యత్తు నిండా
చిక్కని చీకటిలా పరచుకున్న కాలిన మచ్చలు
దు:ఖాన్ని ఎగదోస్తాయి
జీవితాల నిండా
వెలుగు రవ్వలు లేని రాత్రులు
ముల్లై పొడుస్తాయి

ఈసారి అలా ముగియకూడదు
ప్రేమ మరణాన్ని
చరణాలుగా పాడకూడదు
ప్రేమ పల్లవులుగా అల్లుకుంటూ
ఆకుపచ్చగా చిగురించాలి
నిత్యసంజీవినై
తిరస్కరించిన శ్వాసల్లో సైతం
స్నేహాన్ని పలవరించాలి
చిరునవ్వై పలకరించాలి!
- పద్మావతి రాంభక్త
99663 07777