May 30,2022 07:22

అవును... ఈ దేశం నాకు చాలానే ఇచ్చింది
జీవ జలాల స్తన్యమిచ్చింది
పాడి పంటల బువ్వ పెట్టింది
నాగరికతలను నిర్మించేవాణ్ణి జేసింది
చదువు నిచ్చింది సంస్కార మిచ్చింది
ఎవడైనా దురాక్రమణ చేస్తే
యుద్ధం వద్దని శాంతినిచ్చింది
మన సంస్క ృతి గొప్పదంది
ప్రకృతిపై సర్వ పెత్తనం మనదే అంది
అన్నీ అందరికీ సమానమే అంది

ఆ తరువాత ...
ఈ దేశంలో దొంగలు పడ్డారు
కొత్త సంస్క ృతిని మొదలుపెట్టారు
అందరూ ఒకటి కాదన్నారు
తలకొకడు, కాళ్లకొకడు పుట్టాడని
నిమ్నోన్నతాలు సృష్టించారు
తాము చెప్పిందే వేదం అన్నారు
ఆ వేదాలే మీకు శరణ్యం అన్నారు
జన నాగరికతలను విచ్ఛిన్నం చేశారు
జీవ జల మైదాన ప్రాంతాల నుంచి
మమ్ము తరిమివేశారు
మా పశుపతిని ఎత్తుకెళ్లి వాళ్ళ దేవుణ్ణి చేశారు
ఆది చక్రవర్తి జాంబవునికి కోతి రూపమిచ్చారు
పాపపుణ్యాలు కర్మఫలాలు స్వర్గ నరకాలను తెచ్చి
మా చక్రవర్తులను లోబరుచుకున్నారు
అన్ని వ్యవస్థలను బందీకృతం గావించారు

నయవంచకుల ఏలుబడిలో నా దేశం
నాకు అంటరానితనాన్ని అంటగట్టింది
అస్ప ృశ్యున్ని జేసింది
పంచముడనంది పరాయిని చేసింది
గుడి బయటే ఉంచింది బడిలోకి రానీనంది
నువ్వు బానిసవంది ఇదంతా కర్మఫలమంది
చెరువు గట్టుపై ఊరబావిపై
నీకు హక్కు లేదంది తాకితే మైల పడతవంది
గుడి బయట అవమానాలు తట్టుకోలేక
కొత్త దేవుళ్లను వెతుక్కుంటే
నానా విధ దాడులు చేస్తోంది
స్వేచ్ఛాస్వాతంత్య్రాలు సిద్ధించాక
దేశానికి దారి చూపే ఒక కొత్త పుస్తకం దొరికింది
స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం సమన్యాయం
లౌకికత్వం వంటి పదాలు ఎన్నో కూర్చింది

కానీ, ఆచరణలో మళ్లీ నా తల్లి గర్భంలో
పాత చిచ్చు పెడుతూనే ఉన్నారు
రచ్చ చేస్తూనే ఉన్నారు
ఉన్మాదులై ఉరికి వస్తూనే ఉన్నారు
నన్ను దూరం చేయాలని చూస్తూనే ఉన్నారు
ఇంతకీ నేనెవరని నన్ను నేను ప్రశ్నించుకుంటే
నో డౌట్‌... నేను భారతీయుణ్ణి
ఈ దేశం నాది ఈ గడ్డ నాది
నన్నెవడూ ఈ దేశం నుంచి వెళ్లగొట్టలేడు
ఈ గడ్డ నుంచి ఈ గాలి నుంచి
ఈ ప్రశ్న నుంచి ఈ పలుకు నుంచి
చివరకు వల్లకాడు నుంచి కూడా ...!
 

- ఆదూరి వెంకటరత్నం