May 02,2022 06:44

నువ్వో కథ చెబుతుంటావు
నేను ఊ కొడుతుంటాను
కథలో నేనుంటానా గోముగా అడుగుతాను
నీ కథ లేని ఇల్లెక్కడుంది,
చోటెక్కడుందీ అంటావు

'ఆమె కథలన్నీ కల్పితాలు' అనే హాష్‌ టాగ్‌
ఇంటికోటి వేలాడతీశారు కదూ?
పడగ్గది గోడ మీద బల్లి అదే అరుస్తుంటుంది కానీ
దాని భాష ఎవరికి అర్థమవుతుంది?

లోపలి చర్మమంతా గాయాల సలపరింత
పైచర్మమంతా బొబ్బలెక్కిన
ఆచారాల నిగనిగలు
మాటల మలాము పూసుకుంటూ
ఫెమినిజం బరువుని నిశ్శబ్దంగా మోస్తున్న
నెత్తుటి కాగితాలు
చెల్లాచెదురుగా, ఉండలు ఉండలుగా
దేశం గొంతులో
లుంగలు చుట్టుకుపోతున్నవన్నీ ఆమె కథలు

రాత్రి కల పగిలిపోయి
మెలకువలోనూ ఉలిక్కి పడుతున్న నల్లని ఉదయం
నేలకు ఆకాశానికి మధ్య నిలబడి కాలాలు
యుద్ధం చేస్తుంటాయి
జయాపజయాలు మీనమీషాలు లెక్కబెడుతుంటాయి

యుగాల నాటి నా ఈ నిరీక్షణ
సమంజసమైనదని సమర్ధించటానికి
ప్రాణంతో ఉన్న ఒక్క వాక్యమూ
నాకిప్పటి వరకూ తారసపడలేదు
ఏ నిజాన్ని తడిమినా పొడిబారిన సముద్రాలు

కథల నిండా అస్తిత్వ పోరాటాలు
పాత్రలన్నీ కేవలం కల్పితాలు
నువ్వు కథ చెబుతూనే ఉంటావు
అందరూ ఊ కొడుతుంటారు
ఇదంతా ఆమె కథలతో నిండిన చరిత్ర
మాంసం ముద్దలుగా కీర్తింపబడుతూ ...
- వైష్ణవి శ్రీ
80742 10263