శిథిలమైన ఆ భవంతి
గోడల మీద గుర్తులు
ఒకప్పటి జ్ఞాపకాలు
ఎక్కడో తప్పిపోతున్న మాయలో
మళ్ళీ పట్టించే
పాత ప్రేమల చిహ్నాలు
గుండె ముక్కలవుతున్నప్పుడంతా
నిన్ను నీలోకి తొంగిచూసుకోమని
చెబుతున్నట్టుగా తడిస్పర్శ.. ఆ గుర్తులు.
నీలోని సంఘర్షణలకు
ఊరడింపుగా
ఒక చిత్రికను చిత్రిస్తూ వుంటాయి
ఇక ఆ చిత్రికను చూస్తూ నువ్వు
నిశ్శబ్దపు వెన్నెల్లోకి జారిపోతూ
ఇంద్రధనస్సు రంగులను పులుముకుంటూ..
హృదయం లేని మనుషులకు దూరంగా వెళుతూ
పచ్చని నేలను స్పర్శిస్తూ
ఆకాశం వైపు ఆరాధనగా చూస్తూ
కృత్రిమ నవ్వులు లేని పూబాలల సాంగత్యంలో
గోగుపువ్వులా నవ్వుతావు
- లక్ష్మీ కందిమళ్ళ
89196 99815










