చూస్తూ చూస్తూ
ఈ యుద్ధాన్ని నేను స్వాగతించలేను
రెండు దేశాల సరిహద్దుల తెర మీద
ఒకరిది అస్తిత్వ ఘోషైతే
ఒకరిది వదులుకోలేని తనం
సామ్రాజ్యవాదం చేతిలో
రిమోట్ కంట్రోల్
ఈ కుటిల బీభత్స దృశ్యాన్ని ఆస్వాదించలేను
చరిత్రను స్ప ృశించినపుడల్లా
రాలిపడిన నెమలీకల కన్నా
జారిపడిన నెత్తుటి మరకలే ఎక్కువ
చూస్తూ చూస్తూ
ఈ యుద్ధాన్ని నేను కీర్తించలేను
ఊరేగుతున్న శవాల మధ్య
చేతులు తెగి కాళ్ళు నుజ్జు నుజ్జయి
అక్రందించే రక్తపు ముద్దలా
నన్ను నేను ఊహించుకోలేను
ప్రపంచమిప్పుడో
గొలుసు కట్టు కవిత కదా!
ఎక్కడ ఏ రెండు వాక్యాలు ఘర్షణ పడ్డా
అది మొత్తానికి మొత్తంగా
కవిత్వాన్నే దెబ్బతీస్తుంది
చూస్తూండు ఇప్పుడీ యుద్ధం
రేపు కొత్త ఎమ్మార్పీయై
ప్రతి మెడకూ చుట్టుకుంటుంది
ఎక్కడో రెక్కలు విప్పుకున్న యుద్ధం
ప్రపంచం ముంగిట చమురు మంటై
అంటుకుంటుంది
అనాథలైన పసితనాలు
ప్రపంచ ముఖద్వారం ముందు
గుప్పెడు ప్రేమ కోసం
జోలె పట్టుకుని నిలబడతాయి
లేత కళ్ళ నిండా సుడులు తిరిగే ప్రశ్నలు
మనందర్నీ ఉరి కంబానికి వేలాడదీస్తాయి
సగం సగం శిథిలమైన అవయవాలతో ఇళ్లన్నీ
నిన్నటి పాటల్ని తలుచుకుంటూ వెక్కుతుంటాయి
తుపాకులు ఒకళ్ళనొకరు
కౌగిలించుకుని
వ్యూహాలు కరచాలనాలు చేసుకునే వేళకు
శకలాలు శకలాలుగా
నిన్నటి ఆశలూ కలలూ
ఇక యుద్ధానంతర నిశ్శబ్దం..
అది యుద్ధం కన్నా భయంకరం
ఇప్పుడిప్పుడే
కోలుకుంటున్న దేహం మీద
ఈ యుద్ధగాయాన్ని మోస్తూ నడవలేను!
- సాంబమూర్తి లండ










