Aug 31,2022 07:59

శివాపురం గ్రామంలో వినాయకుడు పండగ సంబరాలు ప్రారంభమయ్యాయి. పిల్లలు అందరూ ఉదయాన్నే పత్రి కోసం పొలాలకు వెళ్లారు. పెద్దవాళ్లందరూ పండగ పనుల్లో మునిగిపోయారు.
పార్వతి కేకలతో అప్పుడే నిద్రలేచాడు గణేష్‌. 'అరే గణేష్‌! పండగ కదరా లేచి త్వరగా స్నానం చెయ్యి.' అంది పార్వతి. గణేష్‌ తలస్నానం చేసి, కొత్త బట్టలు వేసుకుని లోపలకు వచ్చాడు. హోంవర్క్‌ చేసుకుందామని గదిలోకి వెళ్లాడు. కాని అక్కడ తన పుస్తకాల బ్యాగు కనిపంచలేదు.
'అమ్మ ఇల్లు తుడుస్తూ..నా బ్యాగు ఎక్కడ పెట్టావు?' అన్నాడు గణేష్‌.
'వినాయకుడు దగ్గర పెట్టాను. పుస్తకాలకు పూజ చెయ్యి. చదువు బాగా వస్తుంది. పదోతరగతి మంచి మార్కులతో పాసవుతావు' అంది.
గణేష్‌కు నవ్వు వచ్చింది.'అమ్మ పుస్తకాలకు పూజ చేస్తే చదువు వస్తుందని ఎక్కడ రాశారు? ఎవరు చెప్పారు? కష్టపడి చదివితేనే మార్కులు వస్తాయి అని మాస్టారు చెప్పారు.' అని పూజ గదిలో ఉన్న బ్యాగు తీసుకుని వెళ్లి హోంవర్క్‌ చేసుకున్నాడు.
సాయంత్రం వేళ ఆరుబయట కూర్చొని గణేష్‌ వాళ్ల నాన్నతో కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పుడే ఫలహారాలు తీసుకుని వచ్చింది పార్వతి.
'అరే బాబు! ఈ రోజు తల ఎత్తి చందమామను చూడకు. నిందలు మోయాల్సి వస్తుంది అంది'.
గణేష్‌ కోపం ఆపులేకపోయాడు. 'అమ్మ ఇవి అన్నీ మూఢనమ్మకాలు. విజ్ఞానం పెరిగే కొద్ది మన ఆలోచనలు శాస్త్రీయంగా ఆలోచించాలని మా టీచర్‌ చెప్పారు. ఎవరైనా తప్పు చేస్తే జనం నిందలు వేస్తారు. అంతేగానీ చవితి రోజు చందమామను చూస్తేనే వేయరు.' అని గణేష్‌ ఫలహారం తినసాగాడు. చిన్నవాడైన గణేష్‌ చెప్పిన మాటల్లో వాస్తవాన్ని గ్రహించారు తల్లిదండ్రులు.
- పద్మావతి