Feb 07,2023 21:49

సచివాలయంలో ఖాళీగా దర్శనిమిస్తున్న కుర్చీలు

మడకశిర రూరల్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ గాడితప్పుతోంది. కొందరు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు. విధినిర్వహణలో అలసత్వం వహిస్తున్నారు. సమయపాలన పాటించడంలేదు. మండలం పరిధిలో గోవిందపురం గ్రామ సచివాలయంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకే సచివాలయంలోని వెల్పేర్‌ అసిస్టెంట్‌ టేబుల్‌పై ప్రశాంతంగా నిద్రపోయారు. సచివాలయ ఉద్యోగులు రిజిస్టర్‌లో సంతకం చేస తర్వాత రికార్డులో ఎక్కడికెళ్తున్నారో రాయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడి అది ఏం లేదు. సంతకాలు పెట్టి ఎవరి దారిన వారు వెళ్ళిపోవడమే. మంగళవారం ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ ఇద్దరే ఉన్నారు. వెల్పేర్‌ అసిస్టెంట్‌ విధులు మరిచి బాధ్యత మరిచి ప్రశాంతంగా నిద్రపోవడం ఆశ్చర్యాన్ని గురిచేసింది. ఎంతోమంది పింఛన్ల కోసం సమస్యలు పరిష్కారం కోసం సచివాలయానికి వచ్చి అధికారి నిద్రపోవడం చూసి వెనుతిరిగి వెళ్లారు. ఇక మహిళా పోలీస్‌, పంచాయతీ సెక్రెటరీ , ఎఎన్‌ఎం, సర్వేయర్‌ వేర్వేరు విధులు నిర్వహించారు. ప్రతిరోజు సంతకాలు పెట్టి సచివాలయంలో ఎవరు ఉండకుండా అధికారులు వెళుతున్నారని తమ సమస్యలు చెప్పడానికి వెళ్లితే సచివాలయాల్లో ఖాళీ కుర్చీలు కన్పిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఉన్నతాధికారులు సచివాలయాల తనిఖీల సంగతి మర్చిపోయారని దీంతో వీరు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజలకు సచివాలయంలో సేవలు అంతంత మాత్రమే అందుతున్నాయని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామ సచివాలయంలో ఉద్యోగులు ప్రజలకు సేవలందించే చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.
కదిరి అర్బన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థ ఆశయాలు కొందరు సచివాలయ ఉద్యోగుల కారణంగా నీరుకారుతున్నాయి. కొందరు ఉద్యోగులు తమ విధులు నిర్వహించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పట్టణ ప్రజలలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది సచివాలయ ఉద్యోగులు హాజరు పట్టికలో సంతకాలు చేసిన తర్వాత రికార్డులో ఎక్కడికెళ్తున్నారో మరో రికార్డులో నమోదు చేయాల్సిఉంది. అయితే ఇక్కడ అవేవీ పాటించడం లేదని తెలుస్తోంది. సమయానికి సచివాలయంలో అధికారులు దొరకరని ప్రజలు వాపోతున్నారు. సచివాలయాలను తనిఖీ చేయడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో కొంతమంది కౌన్సిలర్లు సచివాలయ సిబ్బందిని బదిలీ చేసి కొత్తవారిని తమ వార్డుకు కేటాయించాలని అధికారులకు విన్నవించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సచివాలయ వ్యవస్థను గాడిలో పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.
నంబులపూలకుంట : మండల పరిధిలోని ధనియాల చెరువు సచివాలయం సిబ్బంది పనితీరు మారలేదు. ఇక్కడి ఉద్యోగులు డ్రస్‌కోడ్‌ పాటించడం లేదు. గత నెలలో కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ సచివాలయాల తనిఖీ సమయంలో డ్రస్‌కోడ్‌పై తీవ్రంగా హెచ్చరించారు. డ్రస్‌కోడ్‌ పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే మండలంలోని పలువురు ఉద్యోగులు డ్రస్‌కోడ్‌ పాటించడం లేదు. ఎంత చెప్పినా వీరు తీరు మారలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.