నేనా చిరిగిన కళ్ళలో
విరిగిన పాటల్లో
పగిలిన పాదాల్లో
ఏం దాచుకున్నాననే కదా నీ అనుమానం?
అవున్నిజమే ..
నా లోపల, చితికిన దేశాన్ని దాచుకున్నాను
ఇక్కడ
నవ్వు గౌను వేసుకుని
75దో పుట్టినరోజు కోసం
ముస్తాబవుతున్న పసిపాప నేను కాదు
నువ్వు అలవాటు చేసిన భ్రమల ముఖం
అనుమానం తీరలేదా?
నాలోని అరలన్నీ వెదుకు
ఏదో మూల రక్తంలో ముంచి తీసిన
తిరంగా కనబడుతుంది
నిన్నటి త్యాగాల పాటలేవని అడుగుతుంది
నువ్వు గుండెలు బాదుకుంటావు
గోడల మీద
ఆ బుల్లెట్టు గాయాలేమిటని అడగొద్దు
ఆశోకచక్రం పొలమారుతుంది
కీర్తి కోసం
చూపుల్ని నీవైపు తిప్పుకోవడం కోసం
యుద్ధాన్ని కుక్కపిల్లలా ఉసిగొల్పడమే తెలుసు నీకు
నెత్తురును త్యజించిన శాంతి ఖడ్గం కథ
నిన్ను తప్పక నిరుత్సాహపరుస్తుంది
తెల్లని ఆకాశం మధ్యలోంచి
చరఖా నక్షత్రాన్ని అప్పుడే తీసేయడం బాగుంది
లేకుంటే... నువ్వు ఊపిరి ఆర్పేసిన
స్వదేశీ దీపాల గొంతేసుకుని
అది గిరగిరా తిరుగుతూ వుంటే
నీకు నిద్రపట్టక పిచ్చి లేచేది
నీ కొత్త సారాతో నింపడానికి
పాత సీసాలను వాడొద్దు
సీసాల్లోపల ధమనుల్లో ప్రవహించే
ఆజాదీ పరిమళం అంటుకుని
నువ్వు కన్న ఒకే రంగు ఆకాశం కల విరిగిపోతుంది
వైరస్‌లా విస్తరిస్తున్న నీ వ్యాపార సామ్రాజ్యంలో
నువ్వు పీలుస్తున్న
ఒంటి స్తంభపు కోట బురుజు మీద
నువ్వు ఎగరేయాలనుకుంటున్న నీ జెండా
ఎప్పటికీ ఎగరదు
- సాంబమూర్తి లండ
96427 32008










