Feb 21,2022 08:15

ఎర్ర పుస్తకం ఎర్ర పుస్తకం
కడుపుమంట ఎరిగినోళ్ళ ఎర్ర పుస్తకం
కళ్ళెర్రజేసినోళ్ళ ఎర్ర పుస్తకం
బాధలన్ని తీర్చేదే ఎర్ర పుస్తకం //ఎర్ర//

తరతరాల సమాజాన
తారతమ్యమెక్కడుందొ తెలిపెనే మనకు
ఎర్ర పుస్తకం మన ఎర్ర పుస్తకం
కళ్ళు తెరిచి చూడమనే ఎర్ర పుస్తకం //ఎర్ర//

కాలమెపుడు మారుననీ మనిషి మారి తీరాలని
పాఠమే చెప్పెనులే ఎర్ర పుస్తకం
మారినదే బతుకునని బోధనే చేసి మరీ
ప్రపంచాన్ని మార్చే మన ఎర్ర పుస్తకం //ఎర్ర//

సంపదంత పోగుబడి పెరిగినట్టి బూర్జువాల
బూజు బాగ దులిపెలే మన ఎర్ర పుస్తకం
దోపిడెక్కడుందొ చెప్పి మేలుకొని ఉండమని
కష్టజీవి కళ్ళు తెరిచె ఎర్ర పుస్తకం //ఎ//

కాలమెంత మారినా కలవారు పెరిగినా
డబ్బు సూత్రాలూ తెలిపేదే ఎర్ర పుస్తకం
లేనివాడి తోడు నిలిచె ఎర్ర పుస్తకం
కాలానికి ఎదురొడ్డి గెలిచేనులే ఎర్ర పుస్తకం //ఎ//

రంగు మార్చు పెట్టుబడి దేశాలు తిరిగి తిరిగి
గోళమంత నాదని వాదనలే చేస్తుంటే
కార్మిక కర్షక వీరుల బలం చూసుకొమ్మంది
ఎర్ర పుస్తకం ఎర్రపుస్తకం మన ఎర్ర పుస్తకం
ప్రపంచమే మీదంది ఎర్ర పుస్తం
పిడికిలి బిగియించమనే ఎర్రపుస్తకం
ప్రపంచ బావుటా మీరందీ ఎర్ర పుస్తకం
ప్రపంచ బావుటా తానేనంది ఎర్ర పుస్తకం //ఎ//
 

- జంధ్యాల రఘుబాబు
98497 53298