ఎన్‌టిఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న దృశ్యం
ఎన్‌టిఆర్‌కు భారతరత్న అందజేయాలి
నెల్లూరు :భారతదేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు వచ్చినా, వాటి మనుగడ సాగలేదని, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువారి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన నందమూరి తారకరామారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అందజేయాలని నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ అన్నారు. బుధవారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం మా తెలుగు తల్లి గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంట్ టిడిపి ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి సభ అధ్యక్షత వహించారు. అనంతరం తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులకు కార్యకర్తలకు గౌరవప్రదంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా టిడిపి వ్యవస్థాపక సభ్యులు మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ సమయంలో జరిగిన కొన్ని అంశాలను నాయకులు కార్యకర్తలతో పంచుకున్నారు. నాటి సంఘటనలను నెమరు వేసుకున్నారు. అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఆడ బిడ్డకు ఆస్తిలో సమాన హక్కు, పేదరిక నిర్మూలన లో భాగంగా కూడు గుడ్డ నీరు లాంటి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. మనుషులు గౌరవంగా బ్రతకాలన్న ఆలోచనతో ఆ రోజుల్లోనే ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని, దేశానికి వెన్నెముక్కగా నిలిచిన రైతుకు 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్తును అందించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనమైన చరిత్ర బహుశా ప్రపంచం లో ఎవరికి లేదని కొనియాడారు. నందమూరి తారక రామారావు కేవలం రీల్ హీరో కాదని రియల్ హీరో అని గతంలో మద్రాసిలుగా పిలవబడే వారమని ఢిల్లీలో మనకు గౌరవం ఉండేది కాదని అలాంటిది తెలుగువారి ఖ్యాతిని పెంచి తెలుగుతనానికి ఒక నిర్వచనం ఇచ్చిన మహానుభావుడన్నారు. పార్టీలో రాజకీయం కోసం పని చేసేవారు లేరని సమాజంలో మార్పు కోసం పనిచేసేవారు ఉన్నారని తెలిపారు.రాబోయే రోజుల్లో నందమూరి తారక రామారావు ఇచ్చిన స్ఫూర్తితో అందరం పనిచేసే రాబోవు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు.అనంతరం నగర టిడిపి ఇన్‌ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీకి ఘటైన సవాళ్లు విసిరారు. వైసీపీ ప్రభుత్వానికి చివరి రోజులు ఇవి.వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలుపు, క్యాడర్ లో జోష్ యే దానికి ఉదాహరణ.దళితులకు రాజ్యాధికారం అందజేసిన ఘనత అప్పట్లో నందమూరి తారక రామారావు గారికి దక్కితే.. ఇప్పుడు చంద్రబాబు కే దక్కుతుందన్నారు. ఢిల్లీ పీఠాన్ని , ఇందిరా గాంధీనీ గడ గడ లాడించిన తెలుగు జాతి ముద్దు బిడ్డ తారక రామారావు.కొద్ది రోజులు ఓపిక పట్టండి.. ఇంతకంటే ఉత్సాహంతో పని చెయ్యండి.. బారి మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్ళపాక అనురాధ, విజేత రెడ్డి, జాఫర్ షరీఫ్, పనబాక భూలక్ష్మి, మేకల నరేంద్ర రెడ్డి, పెంచలనాయుడు, కంటే సాయి బాబా, సాబీర్ ఖాన్, గంగాధర్, కువ్వారపు బాలాజీ, తదితరులు పాల్గొన్నారు
ఎన్‌టిఆర్ విగ్రహాలకు టిడిపి నేతల ఘన నివాళి
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ అబ్దుల్ అజీజ్, నగర నియోజకవర్గం ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఘన నివాళులర్పించారు. మాజీమంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని నర్తకి సెంటర్లో గల ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. స్థానిక మూలపేట ప్రాంతంలోని మాజీ సిఎం నందమూరి తారకరామారావు విగ్రహానికి అన్నంగి ప్రసాద్ ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. మినిబైపాస్ రోడ్డు ప్రాంతంలోని అన్నమయ్య సర్కిల్ వద్ద నగర పాలక సంస్థ పార్కుకు ఎదురుగా ఉన్న నందమూరి తారకరామారావు దంపతుల విగ్రహాలకు పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.. వారితో పాటు టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










