Apr 21,2022 07:05

యుద్ధం ... యుద్ధం ... యుద్ధం
యుద్ధమంటే రెండు పక్షాల మధ్య జరుగుతుంది
ఇక్కడ ఒక పక్షమే మరో పక్షంపై దాడి చేస్తోంది
శతఘ్నులూ క్షిపణులూ ఫిరంగులూ లేవు
పేలడాలూ భవంతులు కూలడాలూ లేవు
చావులూ లేవు ... శవాల మోతలూ లేవు
అయినా అది యుద్ధమే ... ముమ్మాటికీ యుద్ధమే

చమురుతో దాడి ... చెత్తతో దాడి
ఇంటి పన్నుతో దాడి ... చంటిబిడ్డ పాలతో దాడి
కరెంటు తీగతో దాడి ... కొళాయి నీటితో దాడి
మీటర్లతో దాడి ... మోటార్లతో దాడి
మారే ధరలతో దాడి ... మార్చేసే దొరల దాడి
సామాన్యుడిపై కార్పొరేట్‌ తిమింగలాల దాడి
కార్పొరేట్ల మోసే పాలక బోయీల దాడి

ఈ యుద్ధంలో జీవన విధ్వంసం ఉంది
నెత్తురు పిండి సత్తువ లాగేసే దాడీ ఉంది
ఊపిరున్న శవాలనూ వదలని దాడుంది
మనిషిని మనిషిగా బతకనివ్వని దాడుంది
ఇది దాడి కాదు యుద్ధం ... ఏకపక్ష యుద్ధం
కనిపించని యుద్ధం ... జనజీవన విధ్వంసం
ఈ యుద్ధం ఇలాగే సాగితే ... సాగిస్తే
ఆకలి బాంబులకు రాలే ప్రాణాలెన్నో
కనపడకుండే కూలే జీవాలెన్నో

ఏకపక్షంగా సాగనిద్దామా?
ఎదురు పక్షంగా నిలుద్దామా?
జనాల ఎదుట పిడికిళ్ళ ప్రశ్న.
 

- ఉన్నం వెంకటేశ్వర్లు