సాహిత్యం సమాజహితం చేకూరుస్తుంది. ఈ సాహిత్య ప్రయోజనం కాలానుగుణమైనది. సమకాలీన సమాజంలోని మంచీచెడులు, సుఖదు:ఖాలు, జీవన విధానం కవి మనసును ప్రభావితం చేసి కలం ద్వారా సమాజాన్ని మేల్కొలుపుతాయి. సర్వకళల సమాహారమైన నాటకాన్ని రచించే రచయితకు సమాజం పరిపూర్ణంగా అవగాహన కావాలి. ఆయా కాలాలే రచయితకు ఆ శక్తిని ఇస్తాయి. ఆ సమాజం రచయితను రాయమని ప్రేరేపిస్తుంది. ఆ వ్యవస్థ రచయితకు దృష్టిని ఇస్తుంది. ప్రక్రియలో పరిణతి, ఊహాబలం, చేవగల రచయిత అక్షరాలు ఆలంబనాలుగా ఆ రచన సమాజ దర్పణంగా నిలుస్తుంది. ముందుకు నడిపిస్తుంది.
తెలుగు నాటకం సమకాలీన జీవన యథార్థ స్వరూప అంతర్దశల సంచలనాల ప్రతిరూపం. అనేకమంది తెలుగు నాటక రచయితలు మానవ జీవితాన్ని వివిధ కోణాల్లో అనేక అవరోధాలను అధిగమిస్తూ తమ నాటకాల్లో చిత్రీకరించారు. డా. కొర్రపాటి గంగాధరరావు తమ జీవితాన్ని నాటక రచయితగా, దర్శకునిగా, ప్రయోక్తగా, నటునిగా ఆ రంగానికి పరిపూర్ణంగా అంకితం చేశారు. గంగాధరరావు దాదాపు 130 నాటక, నాటికలు రచించారు. నవలలు, వ్యాసాలు కూడా రాశారు. వారి నాటక రచనల్లో చారిత్రకాలు, సామాజికాలు, జీవిత చరిత్రలు, సాంఘిక సమస్యాత్మకాలు, రాజకీయాలు, అనుసరణలు, ప్రచారం, ఏకపాత్ర రచనలు, రేడియో నాటకాలు, నవలా నాటకాలు, సినిమా రచనలు ఉన్నాయి. ఒక రచయిత బాపట్ల లాంటి చిన్న ఊరిలో ఉంటూ ఇంత సాహితీ సృష్టి చేయటం, ఇంత పేరు గడించటం ఆశ్చర్యం ఆనందం కలుగుతుంది. ఒక రచనా ఫ్యాక్టరీగా ఉన్న ఆ నాటకాలు 1950-60 దశకాల్లో ఏదో ఒక వేదికపై ప్రతిరోజూ ప్రదర్శితం కావటం, గతంలో తిరుపతి వెంకట కవుల తరువాత అంత ఖ్యాతి డాక్టర్ గారికే దక్కింది.
డా. కొర్రపాటి గంగాధరరావు 1922 మే 10వ తేదీన మచిలీపట్నంలో లక్ష్మీనరసమ్మ, వెంకట కృష్ణయ్య గార్లకు జన్మిం చారు. ఏలూరు, మద్రాసులో చదువుకున్నారు. వైద్యవృత్తిలో బాపట్లలో స్థిరపడ్డారు. తొలిసారిగా 4వ ఫారం చదివేటప్పుడు 'హతవిధి' అనే నాటకం రచించి ప్రదర్శింపజేశారు. 'యిబ్ సన్' వీరి అభిమాన రచయిత. తేలికగా ప్రదర్శించటానికి అనువుగా నాటకాలు రాయటంలో ఆరితేరిన ప్రముఖులు. కొన్ని స్త్రీ పాత్ర లు లేని నాటకాలు కూడా రాశారు. నాటి కాలంలో స్త్రీ పాత్రలకు తగినంతమంది నటీమణులు లభించకపోవటం కూడా ఒక కారణం కావచ్చు.
ఆయన వృత్తిరీత్యా వైద్యులుగా, ప్రవృత్తిరీత్యా రచయితగా బాధ్యతలు నిర్వర్తించారు.వీరి స్త్రీ పాత్రలన్నీ సంస్కార వంతంగా వ్యక్తిత్వంతో ఉంటాయి. స్త్రీలపట్ల వారికి గల గౌరవం, స్త్రీల జీవితాన్ని వారు పరిశీలించిన విధానం, స్త్రీల సమస్యలను అర్ధం చేసుకున్న కోణం, పఠితలను, ప్రేక్షకులను ఆలోచింపచేస్తాయి, ఆనందింపజేస్తాయి. గంగాధరరావు స్త్రీల సమస్యలు ఇతి వృత్తాలుగా అనేక రచనలు చేశారు. స్త్రీ ప్రేమ, పెళ్లి, వరకట్నం, వేశ్యావృత్తి మొదలైన విషయాలతో పాటు సమాజంలో స్త్రీని ఎలా చూస్తున్నారో, ఆమె సమస్యలకు సమాజం ఎలా స్పందిస్తోందో తన రచనల ద్వారా తెలియ జేశారు. ఆయన రాసిన కొన్ని ప్రముఖ నాటకాల్లోని స్త్రీ పాత్రల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
నిర్మల : విజయవాడ రైల్వే ఇనిస్టిట్యూట్ వారు ఈ 'నిర్మల' నాటకాన్ని హైదరాబాద్ నాటక కళాపరిషత్‌లో 1965లో ప్రదర్శించారు. రచయిత మాటల్లో 'నిర్మల నాటకంలో అవినీతి కరమైన సన్నివేశాలు ఉన్నాయని చదివినవాళ్లుగానీ, ప్రదర్శన చూసినవాళ్లుగానీ అనలేదు. నాయిక రేణుక మానసికంగా వ్యభిచారిణి కాలేదు. చివరికి వేశ్యత్వాన్నీ, ప్రేమనూ కూడా వదులుకొని వివాహబంధాన్ని గౌరవించి తన నిర్మలత్వాన్ని నిరూపించుకున్నది.
'నిర్మల' నాటకంలో వేశ్యగా జీవితం గడిపే స్త్రీ పాత్ర ఉంది. ఆమె భర్త ఖూనీ కేసు మీద జైలుకు వెళ్ళాడు. 14 ఏళ్ల తర్వాత తిరిగి వస్తాడని ఆమె ఎదురుచూస్తుంటుంది. ఆర్ధిక సమస్యల్లో ఉన్న ఆమెను సమాజం వేశ్యావృత్తిలోకి దింపుతుంది. ఆమెని ఆరాధించిన విశ్వం ఆమెను ఆ వృత్తినుంచి బయటికి తీసుకు రావాలని ఆలోచిస్తాడు. రేణుక కసితో లోకాన్ని చెడగొట్టాలను కుంటుంది. కానీ అది సరికాదని తానే తెలుసుకుంటుంది. తన హృదయ పవిత్రతను ఎలా నిరూపించుకోవాలో ఆమెకు తెలియదు. జైలు నుంచి తిరిగి వచ్చే రాజారావును భర్తగా వివాహబంధాన్ని అంగీకరిస్తుంది. అతడు తిరిగిరాకపోతే వైధవ్యం అనుభవించటానికి సిద్ధపడుతుంది. నాటకంలో ప్రతి పాత్ర, సంభాషణ, సమాజాన్ని ప్రతిబింబించే విధంగా ఉన్నాయి. రేణుక పాత్ర ద్వారా రచయిత వేశ్యావృత్తిలో అమాయకులెలా దింపబడతారో తెలియజేశారు. చివరకు రాజారావు ఆమెను అర్ధం చేసుకున్నాడు. ఆమె పవిత్ర హృదయాన్ని గుర్తించగలిగాడు.
కమల : డాక్టర్ కొర్రపాటి వారి నాటకాల్లో బహుళ ప్రజాదరణ పొందిన నాటకం 'కమల'. అనేక ప్రదర్శనలు పొందిన ఈ నాటకాన్ని 1954లో రచించారు. ఇది ఒక ప్రేమకథ. 1955లో హైదరాబాద్ ఆంధ్ర నాటక కళాపరిషత్‌లో బాపట్ల కళావనిచే ప్రదర్శితమైనది.
ప్రేమవిఫలమై పెళ్లి మరొకరితో జరిగి, మానసిక సంఘర్షణకు గురయ్యే కమల కథ ఇది. ప్రకాశం, కన్నబాబు అన్నదమ్ములైనా వాళ్ళ తల్లులు వేరు. ఒకరంటే ఒకరికి ప్రేమ. కమల పొరుగింటి అమ్మాయి. కమల, కన్నబాబు ప్రేమించు కుంటారు. కానీ, కమల పెళ్లి ప్రకాశంతో జరుగుతుంది. ఈ పెళ్లి వెనుక ఉన్న ఒక రహస్యమే సస్పెన్స్. పెళ్లయ్యాక కూడా కమల, కన్నబాబుల సన్నిహితత్వం ప్రకాశానికి అనుమానం కలిగిస్తుంది. ప్రకాశం కమలను గాఢంగా ప్రేమించాడు. ''కమలా, విశ్వసించగల భార్యను కాదు నేను కోరేది, ప్రేమించ గల కమలను. నీ మనసును నాకివ్వటానికి అది నీ స్వాధీనంలో ఉన్నదా?'' అని అడుగుతాడు ఒకసారి. కన్నబాబు కమలను వదినగా గౌరవిస్తాడు. మనోవేదన అణచుకుంటాడు. తల్లి బెదిరింపు వల్ల కమల కన్నబాబును కాదని తనని బలవంతపు పెళ్లి చేసుకుందని తెలుసుకున్న ప్రకాశం పాలల్లో విషం కలిపి తల్లిని చంపబోతాడు. ఆ పాలను విలన్లు తాగి మరణించటం కొసమెరుపు. ఈ నాటకంలో కమల పాత్రలోని మానసిక సంఘర్షణను రచయిత అద్భుతంగా చిత్రీకరించారు.
ఆరని పారాణి : డాక్టర్ గంగాధరరావు గారి నాటకాల్లో బహుళ ప్రసిద్ధమై ప్రజాదరణ పొందిన అప్పటికి 90వ నాటకం ఇది. ఈ నాటకానికి సి.ఎస్.రావు ముందుమాట రాస్తూ.. ''డాక్టర్ గారి నాటకాలు సామాజిక జీవితానికి ఎంతో దగ్గరగా ఉంటూ, ఆ జీవితాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి. దానితోబాటు సమాజంలో ఉన్న కుళ్లును కడుగుతూ, సమాజంలోని అత్యాచారాలపై వాతలు వేస్తూ వాడిగా వేడిగా ఉంటాయి. వీరు నాటకంగా రూపొందించని విషయం వెదికి పట్టుకోవటం కష్టమే. ఈ నాటకాన్ని తరచి చూస్తే అండర్ కరెంట్‌గా రచయిత వర్గదృక్పథం స్పష్టమౌతుంది. ఇంగ్లీషు నాటక సాహిత్యంలో 'షేక్ స్పియర్ షో' ఉన్నంతకాలం తెలుగు నాటక సాహిత్యంలో కొర్రపాటి గంగాధరరావు గారూ ఉంటారు.
కథ విషయానికొస్తే మధుసూదనం ధనవంతుడు. కాశీ, వంశీ అతని కొడుకులు. పట్నంలో చదువుకుంటున్న కొడుకులకు వంట చేసిపెట్టే మాల అనే అమ్మాయి వంశీని ప్రేమిస్తుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. మాల తండ్రి సీనయ్యకీ, వంశీ తండ్రి మధుసూదనంకీ ఈ పెళ్ళికి అభ్యంతరం లేదు. అయినా మాలను కాశీ చెరుస్తాడు. కొంత ఆలోచించిన వంశీ మాలతో పెళ్ళికి ఒప్పుకుంటాడు. మనసు చంపుకుని మాల కాశీని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటుంది. కానీ కాశీ, వంశీ పరస్పర త్యాగం పేరుతో ఆమెను స్వీకరించటానికి సిద్ధపడరు. ఇది తెలిసిన మాల పెళ్ళికూతురి ముస్తాబులో ఆరని పారాణితో ఆత్మహత్య చేసుకుని మరణిస్తుంది. అలా మరణించిన మాలను చూసి అంతా దు:ఖస్తారు.
మరణించే ముందు మాల ఇలా అంటుంది : ''తీరని కోరికలున్న తియ్యని కలలే మంచివి. బతుకే ఒక కల అనుకుంటే బతకటానికి ఎంత ధైర్యమైనా వస్తుంది. కానీ కలలు కనటానికి బతికి ఉండాలా.. మగవాళ్ళు తుమ్మెదలు కాదు. మేం పువ్వులమూ కాదు. మనం మనుష్యులమ్.. నూరేళ్ళూ బతకాల్సిన మనుష్యులమ్' డాక్టర్ గారికి స్త్రీల పట్ల ఉన్న గౌరవం ఈ డైలాగులో కనిపిస్తుంది. ఈ నాటకంలో రచయిత సెంటిమెంట్‌తో కూడిన సంఘటనలనూ, స్త్రీకి జరిగే అన్యాయాన్నీ చిత్రీకరించారు.
పూల దోసిళ్ళు : ప్రముఖ రంగస్థల నటులు చాట్ల శ్రీరాములు వంటి వారి ప్రశంసలు పొందిన గంగాధరరావు గారి నాటకం 'పూల దోసిళ్ళు'. రచయిత తన మాటగా చెప్తూ 'ప్రేమ అంటే ఏమిటో నిర్వచించటానికి చేసిన ప్రయత్నం' అని పేర్కొన్నారు. నిర్మల్ ధనవంతుల కొడుకు. ప్రేమ, పెళ్లి గురించి చదివి, విని ఒక నిర్ధారణకు వచ్చిన యువకుడు. అంజి అతని స్నేహితుడు. మధ్య తరగతికి చెందినవాడు. చిన్న ఉద్యోగి. నిర్మల్ రూమ్‌లో ఉంటాడు. నిర్మల్‌కి మరో స్నేహితుడు రాజు, ధనవంతుడు. దాసు బీదవాడు, కవి. అనంతం 40 ఏళ్ల వాడు. సునీత పల్లెటూరి పిల్ల, అనాధ, తెలివైనది, అందమైనది కూడా.
పెళ్లి విషయంలో నిశ్చితమైన అభిప్రాయాలున్న నిర్మల్, స్నేహితుడు అంజి మేనమామ మాటలతో ప్రభావితమై ఆవేశంతో ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఒక బీద అమ్మాయిని తీసుకువచ్చి ఆమెకు చదువు, సంస్కారం, అలంకరణ, వేషభాషలు నేర్పి ప్రేమించి పెళ్లాడదగినదానిగా తయారు చేయాలని అనుకుంటాడు. సీత అనే పళ్ళు అమ్ముకునే అమ్మాయిని చేరదీసి తాను అనుకున్నట్లు తయారుచేస్తాడు. సీత సునీతగా మారుతుంది. నిర్మల్ సునీతకు స్వయంవరం ఏర్పాటు చేసి యువకులందరినీ సమావేశపరచి సునీతను పరిచయం చేస్తాడు. అంతా ఆసక్తిని చూపుతారు. వాళ్ళను పరీక్షించటానికి సునీత వేషం మార్చుకుని పూలు అమ్ముకునే అమ్మాయిలా వస్తుంది. అందరూ అసహ్యించుకుంటారు. కానీ రాజు అలా చేయడు. అతను రోజూ సునీతకు గులాబీలు ఇస్తుంటాడు. నిర్మల్‌కి రాజు, సునీత ప్రేమ అర్ధమై వారికి పెళ్లి జరిపించాలని నిశ్చయించుకుంటాడు. ''ఒకరినొకరు పూర్తిగా విశ్వసించడం, తన వ్యక్తిత్వాన్ని మర్చిపోవటం జరిగినది. అదే నిజమైన ప్రేమ'' అని నిర్మల్ భావిస్తాడు.
1965లో రాసిన ఈ నాటకం బాపట్ల కళావని వారు ప్రదర్శించారు. జె.బి.షా రచించిన 'పిగ్ మాలియం'కు అనుసరణ. హాస్య ప్రధానం. అయినా సమస్యాత్మక వినోదం. సునీతనూ, సీతనూ సమానంగా చూసే రాజు ప్రేమ నిజమైనది. విశ్వాసమే ప్రేమ. నేర్పితే వచ్చేది కాదు. ధనం, అంతస్తు కాకుండా మనసులోంచి పుట్టే ప్రేమకు పెద్దపీట వేసిన ఈ నాటకంలో సునీత పాత్ర ఉదాత్తమైనది. కొర్రపాటి తాను రాసిన నాటకాల్లో అనేక వర్తమాన అంశాలపై చర్చ జరిగేలా చేశారు. వరకట్నం, కుటుంబ సంబంధాలు, సామాజిక స్ప ృహ, మహిళలకు గౌరవం వంటి అంశాలపై తమ నాటకాల్లో ప్రస్తావించారు. ఆయన నాటకాలను రాయటమే కాదు; స్వయంగా అవి వేదికలపై ప్రదర్శించటంలోనూ భాగస్వామ్యం పంచుకునేవారు. డా.కొర్రపాటి వారి శత జయంతి సందర్భంగా ఆయన నాటకాల గురించి ప్రస్తావించుకోవటం వారికి ఒక నివాళి.
(ఇది డాక్టర్ కొర్రపాటి శత జయంతి సంవత్సరం)
- డా. సి.భవానీదేవి
98668 47000










