బీజింగ్ : అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆదివారం చైనా రాజధాని బీజింగ్‌కు చేరుకున్నారు. అమెరికా అత్యున్నతస్థాయి దౌత్యాధికారి ఐదేళ్ల తర్వాత మొదటి సారి చైనాలో పర్యటించడం గమనార్హం. ఆయన చైనాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. అమెరికా-చైనా మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ వైఖరి కొనసాగుతున్న వేళ ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకొంది. ఈ పర్యటనతో చైనా-అమెరికా మధ్య ఉన్నత స్థాయి కమ్యూనికేషన్లను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. అయితే కీలక మార్పులు చోటు చేసుకొనే పరిస్థితి లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో బ్లింకన్ చైనా విదేశాంగ మంత్రి గాంగ్, ఉన్నత దౌత్య అధికారి వాంగ్‌యితో భేటీ కానున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సోమవారం సమావేశం కానున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. వాస్తవానికి బ్లింకెన్ ఫిబ్రవరిలోనే చైనాలో పర్యటించాల్సి వున్నప్పటికీ .. వాయిదా పడిన సంగతి తెలిసిందే.










