'చలోఢిల్లీ'కి మద్దతుగా ప్రదర్శన
ప్రజాశక్తి-మర్రిపాడు : కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ 5వ తేదీన జరుగనున్న చలోఢిల్లీ కార్మిక కర్షక పోరాటాలకు మద్దతునిస్తూ ప్రజా సంఘాల నాయకులు సిపిఎం కార్యాలయం నుండి బస్టాండ్ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ విధానాల వల్ల రైతాంగం ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేదని అందుకే మహాధర్నా చేపట్టామన్నారు. రైతు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు నిర్ణయించాలని, నిర్ణయించిన కనీస మద్దతు ధర రైతుకు అందే లా చట్టం చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2020 కేంద్ర విద్యుత్ సవరణ చట్టం రద్దు చేసి, వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్తు మీటర్లు బిగించడాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. రుణ భారంతో కుంగిపోతున్న రైతులను ఆదుకోవడానికి రుణ విమోచన చట్టాన్ని తీసుకురావాలని, భూ యజమానితో నిమిత్తం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేసి వ్యవసాయంకు రుణాలు ఇవ్వాలని, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కౌలు రైతులకు నష్టపరిహారం అందించాలన్నారు. ప్రతి వస్తువుకి ధరను నిర్ణయించారు కానీ, రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారని తెలియజేశారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దుచేసి కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజనం కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, కాంట్రాక్టు పద్ధతిపై ఇచ్చే ఉద్యోగాలు నిలుపుదల చేసి పర్మిట్ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌డి రహంతుల్లా, సిఐటియు మండల కార్యదర్శి రత్నయ్య, ఐద్వా మండల అధ్యక్షురాలు మూలి ప్రమీల, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తిరుపతి, సీనియర్ నాయకులు మునగాల సూర్యనారాయణ, ఐద్వా గ్రామ నాయకురాలు ఖాసింబీ, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.










