Feb 28,2022 07:56

అక్షరాన్ని బాణంగా ఎక్కుపెట్టి సమస్యలపై సంధించడం అంత కష్టమేమీ కాదు. ఆ భావవ్యక్తీకరణ ఏ కోణంలోంచి తొంగిచూస్తుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఆ ప్రయత్నం కవయిత్రి చెళ్ళపిళ్ళ శ్యామల గారి 'మోడూ చిగురిస్తుంది' కవితాసంపుటిలో కనబడుతుంది. ఈ శీర్షికను ఎంచుకోవడంలోనే ఒక ఆశావహ దృక్పథం కళ్ళ ముందు మెదులుతుంది. ఆద్యంతం చైతన్యబావుటాను ఎగరేస్తుంది. 74 కవితలతో పొందుపరిచిన ఈ సంపుటిలో అంతర్వాహినులు, సామూహిక వేదనలు, అంతర్ముఖ ఉక్కపోతలు, అనుభూతుల పరవళ్ళు చైతన్యంతో మూకుమ్మడిగా అక్షరకవాతు చేస్తాయి. ఇలాంటి మౌన సంఘర్షణ రాపిడిలోంచి రాటుదేలిన హృదయ ప్రతిస్పందనలే ఈ కవితలు. వీటి మూలాల లోతుల్ని మనసుతో తడిమితే తప్ప ఆకళింపు చేసుకోలేం.
'విశ్వవ్యాప్తమైన / ఒకే గొడుగు కింద
ప్రపంచమంతా అంగడిగా మారి
సామ్రాజ్యవాదపు భ్రమల్లో భ్రమణమై
దేశాన్ని పొట్లం గట్టి
అంగడి సరుకును చేస్తుంటే
రక్షించే నాయకుని కోసమే

నా వెతుకులాట'' అంటారు కవయిత్రి 'కాకుల గుంపు' కవితలో. భ్రమే సామూహిక వాతావరణంగా మారిన ఈ భ్రమావరణంలో బలిపశువుల్లా బతుకుల్ని వెళ్ళదీస్తున్న ప్రజాజీవితాలు రక్షక నాయకుడికోసం అన్వేషిస్తూ కాలాన్ని వృథా చెయ్యడం ఒక అత్యాశే అవుతుంది. సామ్రాజ్యవాదం ముసుగులో ప్రపంచీకరణ మాయాజాలంలో పడి ప్రపంచం కుగ్రామంగా మారిపోవడం భరింపలేని ఒక విషాద సత్యదృశ్యం. పైకి కనపడని హృదయపు రంపపుకోత. అదే దృక్పథాన్ని విశ్వ చైతన్యపరిధిలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారు కవయిత్రి. వెదుకులాటకన్నా సత్వర పరిష్కార మార్గాలే కొత్తచూపుని ప్రసాదిస్తాయి. అదే నిజమైతే వసుధైక కుటుంబం కల సామూహిక ముఖచిత్రంగా దర్శనమిస్తుంది.
ఇంకోచోట 'దృష్టి' కవితలో పట్టణీకరణ వికృతరూపంపై విముఖత కనిపిస్తుంది.
'రంగుల భవంతులు/ నాకేందుకో
మైదానం మీద వాలే/ రాబందుల్లా కనిపించాయి' అంటూ అసలు నిజాన్ని తేటతెల్లం చేస్తారు. బహులంతస్థుల భవంతుల నిర్మాణం జోరుగా ఊపందుకుంటున్న తరుణంలో విశాల మైదానాలన్నీ రాబందు చూపుల్లాంటి స్థిరాస్థి వ్యాపారుల కంట పడీపడడంతోనే అది కట్టడమయంగా రూపాంతరం చెందుతోంది. ఈ స్థితిని చాలా వ్యంగ్య స్పృహతో కవయిత్రి చిత్రీకరించారు.
''ఒప్పుకుంటున్నా.. మహిళా/ నీవు లేని నట్టిల్లు
శిశిరానికి చిరునామా
నీ ఉన్న చోటు/ నిత్య వసంతాల సీమ'' అని అనడంలో మహిళా ప్రాధాన్యతని స్త్రీవాద కోణంలో ప్రతిబింబిస్తుంది. ఆడదే మానవ మనుగడకి ఆధారభూతమైన కేంద్ర బిందువని చెప్పకనే చెబుతుంది. 'మౌనం' శీర్షికలో చెప్పినట్టు తాత్త్విక దృష్టి మెండుగా రూపుకడుతుంది. ''లక్ష్యం కోసం/ సంకల్పబలంతో/ యోగముద్రలో వున్న/ మౌనిలా/ కన్పిస్తోంది చెట్టు'' అని చెప్పడంలో ఒక స్థిరమైన ఆలోచనకు ప్రశాంతమైన అక్షరరూపం ఇవ్వడం ప్రతిఫలిస్తోంది. లక్ష్యసాధనకు మూలమైన సహజ మానవ స్వభావ గుణాన్ని చెట్టుకు ఆపాదించి ప్రతీకగా మలిచి చెప్పారు కవయిత్రి. పైకి ఇది సాధారణ విషయంగానే కనిపించినా, అంతర్లీన దృశ్య సందర్భాన్నేదో కవిత్వమయం చేస్తున్నారు.
''పిట్టై ఎగిరిన మనసు/ ఆకుపచ్చని ప్రవాహంపై/ పరిగెడుతూనే ఉంది/ దృశ్యాలన్నీ మబ్బులై/ నయనాకాశంలో తిరుగాడుతున్నాయి'' అంటారు 'ఆ దారి' శీర్షికలో శ్యామల గారు. సరళ వచనాన్ని సహజ కవిత్వంగా మలిచే రసవిద్య ఈ వాక్యాల్లో ప్రస్ఫుటమవుతుంది. పిట్ట మనసుని ఆకుపచ్చని ప్రవాహంగా చిత్రిస్తూ, మబ్బు దృశ్యాల్ని నాయనాకాశంలో వీక్షించే ప్రయత్నం చెయ్యడం అనుభూతికి పరాకాష్టగా చెప్పొచ్చు. ''జల్లెడలోంచీ/ ఇసుక రాలినట్టు/ జారిపోతూనే ఉంటుంది / కాలం'' అని వ్యక్తీకరించడంలో యాంత్రికమైన మానవ ప్రపంచంలో నిత్య దినచర్యలని, గడిచిపోతున్న రోజులకి ప్రతీకగా జారిపోతున్న కాలాన్ని కొండగుర్తుగా అభివర్ణిస్తారు కవయిత్రి.
ఇలా ఈ సంపుటి పొడుగునా తొణికిసలాడే కవితాత్మక పంక్తులు ఇంకా చాలా ఉన్నాయి. 'మనిషితనం మొదలు తెగిన వక్షమైంది', 'విదేశానికి వలస పక్షినై ఎగిరాను', 'నీ అనుభూతులు/ అనుక్షణం నా నీడై/ నడుస్తున్నాయి', 'ఆమె జీవన చిత్రం చెదిరిపోయింది', 'చిరిగిన చొక్కాలోంచి/ చేజారిన నా బాల్యాన్ని', 'ఇదొక జ్ఞాపకాల పందిరి', 'రచ్చబండై మాట్లాడుతుంది', 'కరిగిన మట్టి వాసన కోసం', 'నా కోరికో ఎండమావి', 'పరిమళం కోల్పోయిన కుసుమాలు', 'తన స్పర్శతో మాలిన్యాన్ని కడిగి', 'వాడి పసినవ్వు/ పాలపిట్టై ఎగిరిపోయింది', 'చీకటి ముసుగుల్ని అన్వేషిస్తూ', 'అణచివేత ఎప్పటికీ నేరమే', 'సెలయేటి పిల్లగాలి సవ్వడి', 'ఊతకర్రగా మారి/ అక్షరాలు నన్నిపుడు నడిపిస్తున్నాయి', 'సాంస్క ృతిక కాలుష్యం చుట్టుకొని', 'బతుకు సంచీని/ భుజానికి తగిలించుకుని', 'ప్రకృతి/ యోగనిద్రలోకి జారుకుంది', 'కొన్ని జ్ఞాపకాలు/ ఏ చెట్టు కొమ్మకో తగులుకున్నట్లు', 'పడగ విప్పిన మృగత్వం/ కన్యత్వాన్ని కాటేసినప్పుడల్లా', 'నాలుగు కళ్ళు నిరీక్షిస్తుంటాయి', 'మనసు పల్లకిలో ఊరేగుతున్నాయి', 'రంగవల్లుల్లా కన్పిస్తున్నాయి/ రంగు రంగుల భవనాలు', 'పడి లేచిన కెరటమయ్యాడతను', 'పూలై నవ్వులు విరబూస్తుంది', 'నా చేతుల్లో కొన్ని అక్షరాలు మొలిచాయి', 'ఎత్తిన పిడికిలి/ కొడవలైతే', 'హరివిల్లై అంబరానికెగిరాను', 'మనసు మయూరమై పురి విప్పింది', 'పచ్చని మొక్కలై వాళ్ళు ఎదుగుతుంటే', 'వాన చినుకు కోసం/ ఆకాశం వైపు చూసే పైరులా', 'కాలమే కలల్ని కరిగించగలదు', 'మనిషి మొలకై చిగురిస్తాడు' , 'కాలం మౌనగీతం ఆలపిస్తోంది', 'అమ్మ చేతి కమ్మని కాఫీ నయిపోతాను', 'గాలి జోలపాడి/ తల్లిలా నిద్ర పుచ్చుతుంది', 'మాటల కందని చైతన్యం/ మౌనంలో ప్రవహిస్తుంది', 'కోడి కంటే ముందే కూసిన/ కుక్కర్లో ఉడికిన మెతుకు', 'నిశిని మింగిన సూర్యుళ్ళు', 'జారిన జ్ఞాపకాలన్నీ/ తడితడిగా కదిలి', 'ఆశల రెక్కలతో/కలల తీరం వైపు', 'అమ్మ కడుపులోంచే/ యుద్ధం చేస్తోందిపుడు', 'దిగులు మబ్బై కూర్చుంది', 'మనసుని దూది పింజగా మార్చేసింది', రంగులు పులుముకున్న/హరివిల్లులా ఉన్నాడతను', 'ఆలోచన కడలి కెరటమైతే', 'గాఢ నిద్రలో/ మునిగిపోయింది రాత్రి', 'పసిపిల్లల నవ్వులై/ చెట్లన్నీ పలకరిస్తుంటే', 'ప్రపంచీకరణ/ పులినోట మేకయింది', 'నా చిరకాల వాంఛను/దుప్పట్లో చుట్టి కప్పుకుందామనుకుంటే', 'అయ్య స్వేదంతో/ తడిసిన మట్టిలో/ మొలకై లేస్తుందామె', 'చిగురుటాకులా/ వణికిన నిన్ను', జ్ఞాపకాల పొరల్ని తవ్వి/ తనివితీరా ఒళ్ళంతా పూసుకోవాలని', 'మానవత్వం కులం/ మర్రి చెట్టు నీడలా', 'చివురించిన చెట్టునయ్యాను', 'కాలం మౌనగీతం ఆలపిస్తోంది వంటి తళుకులు చైతన్యపూరితమైన ఆలోచనల్ని రేకెత్తిస్తాయి.
సూక్ష్మదృష్టితో పరిశీలిస్తే మరికొన్ని మెరుపులు రక్తికట్టిస్తాయి. వీటిలో 'పూల చెట్టులాంటి నేను', 'ధైర్యాన్ని శ్వాసగా చేసి', 'జ్ఞానాన్ని విత్తులుగా మార్చి', 'కష్టాల్ని ఊతకర్రగా చేసిన', 'ఒళ్ళంతా ఉలిడెబ్బలై', 'సానుభూతి గాయాలు', 'గాలిగుడ్డతో తుడిచి', 'నిశీధిని చీల్చిన కిరణం', 'రణన్నినాద క్షేత్రంలో', 'పాశ్చాత్య కాలుష్యమేఘం', 'నేలంతా తెలుగుదనం నిండి', 'ఆకాశమై చిగురిస్తూ', 'హిమ శకలాలై కరిగిపోయాక', 'కిటికీ రెక్కలోంచి చూపు నిలిపి', 'నవ్వుల పరిమళాలు', 'వెకిలి చూపుల బాణాల్ని', 'సానుభూతి నాణేలు', 'ముక్కలౌతున్న మమతల్ని చూసి', 'ఎదురు చూపుల్ని ఒంపాక', 'చైతన్యం మొలకెత్తించినవాడు', 'బిందువంత ఆత్మ స్థైర్యం', 'గెలుపు తీరం చేరేందుకు', 'చీకటి రాక్షసులతో పోరాడి' లాంటి విలక్షణ వాక్యాలు అక్కడక్కడా పొడసూపుతాయి. కవితా శీర్షికల్లో జ్ఞాపకాల పందిరి, నవ్వుల ఓదార్పు, పరిమళం లేని పచ్చదనం, చిత్రాలు మాట్లాడేక, అక్షర గవాక్షాల్లోంచి, అమ్మెళ్ళిపోయింది వంటివి ప్రత్యేకత కలిగిన మరికొన్ని కొసమెరుపులు.
కవయిత్రి చేసిన ఈ సుదీర్ఘ కవితాప్రయాణంలో స్పృశించని అంశమంటూ ఏమీ లేదు. సాహితీస్రవంతి సహకారంతో అక్షరరూపం దాల్చిన ఈ కవితాసంపుటి సరళత్వానికీ సహజత్వానికీ పెద్దపీట వేసింది. సామాజిక సమస్యల్ని ప్రతిబింబించడంలో ఈ కవయిత్రి చేసిన కృషిని ఎంతైనా అభినందించి తీరాల్సిందే!

- మానాపురం రాజా చంద్రశేఖర్‌,
77940 39813