Sep 01,2022 22:20

ప్రజాశక్తి-మైలవరం
భవన నిర్మాణ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి నరసింహారావు అన్నారు. మండలంలోని వెల్వడం గ్రామంలో గురువారం రెయిన్‌బో పెయింటర్స్‌, అక్షర తాఫీ వర్కర్స్‌ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు సంవత్సరాల కాలంలో భవన నిర్మాణ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమిలేదన్నారు. ఇసుక అందుబాటులో లేక వందలాది కార్మికులు ఉపాధి కోల్పోయారని, పస్తులతో ఎంతో మంది కార్మికులు మరణించారని అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిమకుట్టినట్లు కూడా లేదన్నారు. ఈనెల 13వ తేదీన జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తు న్నామన్నారు. సంక్షేమ బోర్డు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరలించిన నిధులను తిరిగి చెల్లించాలని, సంక్షేమ పథకాలు నిలుపుదల చేస్తూ తీసుకువచ్చిన జీవో 12, 14ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ మండల కార్యదర్శి సీహెచ్‌ సుధాకర్‌, రెయిన్‌బో పెయిం టర్స్‌ యూనియన్‌ నాయకులు పత్తిపాటి నాగేశ్వరరావు, రవికుమార్‌, శ్రీను, వర ప్రసాద్‌ పాల్గొన్నారు.