Feb 05,2023 21:30

ప్రశంసాపత్రాలతో సేవా సమితి ప్రతినిధులు

ప్రజాశక్తి - పరిగి : పరిగి,హిందూపురం మండలాల వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న భగత్‌ సింగ్‌ సేవా సమితి ఖాతాలో మరో జాతీయ అవార్డు చేరింది. చెన్నైకి చెందిన అమెరికన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ యూరోపియన్‌ అచీవర్స్‌ 2023 కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు సద్దాం హుస్సేన్‌ ది బెస్ట్‌ సోషల్‌ వర్కర్‌ అవార్డ్‌ను భగత్‌ సింగ్‌ సేవాసమితికి ప్రకటించారు.ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ సభ్యులు శనివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందుకున్నారు. గత కొన్ని ఏళ్లుగా గ్రామంలో పలువురు నిరుపేదలకు అన్నం పాకెట్ల పంపిణీ, చలికాలంలో హిందూపురం పరిసర ప్రాంతాల్లో ఇబ్బంది పెడుతున్న బిక్షగాళ్లకు దుప్పట్లు పంపిణీ, పండుగలు ప్రతి నిరుపేద ఇంట పండుగ వాతావరణం కొనసాగాలని ఉద్దేశంతో వందల కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాలను భగత్‌సింగ్‌ సేవా సమితి చేపడుతోంది. అంతేకాకుండా ప్రతి విద్యార్థికి అనువుగా భగత్‌ సింగ్‌ సేవా సమితి లైబ్రరీ ఏర్పాటు, గ్రామీణ ప్రాంతాలలో ప్రధాన రోడ్లలో గుంతల మయంగా ఉన్న రోడ్లకు యువకుల ఆధ్వర్యంలో మరమ్మతులు ఏర్పాటు వంటి కార్యక్రమాలను నిర్వహించింది. వీరి గుర్తించిన వారు ఈ అవార్డును ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని కమిటీ సభ్యులు కార్తీక్‌, వేణుగోపాల్‌, ప్రసన్న లీల, సంతోష్‌, ఆంజనేయులు, హరి తెలిపారు. మరిన్ని కార్యక్రమాలు ప్రజా శ్రేయస్సు కోసం నిర్వహిస్తామని వారు అన్నారు. ఈ సేవా కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించిన పలువురు దాతలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.