న్యూఢిల్లీ : గీతాంజలిశ్రీ హిందీ నవల 'రెట్ సమాధి' 2022 సంవత్సరానికి గాను అంతర్జాతీయ బుకర్ బహుమతిని గెలుచుకుంది. రెట్ సమాధి బుకర్ ఫ్రైజ్‌కు ఎంపికవడంతో భారతీయ భాషల్లో మొదటి పుస్తకంగా నిలిచింది. ఈ నవలను డైసీ రాక్ వెల్ ‘ టాంబ్ ఆఫ్ శాండ్ ’ గా అనువదించారు. రెట్ సమాధి ఒక కుటుంబానికి సంబంధించిన కథ. ముఖ్యంగా ఒంటరి మహిళకి చెందింది. నా పుస్తకం బుకర్ బహుమతికి ఎంపికవుతుందని కలలో కూడా ఊహించలేదని, ఈ వార్త విని ఆశ్చర్యానికి గురయ్యానని గీతాంజలి శ్రీ పేర్కొన్నారు. ఈ అవార్డు రావడం సంతృప్తిని కలిగించిందని అన్నారు. రెట్ సమాధి అనేది మనం నివసించే ప్రపంచానికి ఒక విషాదగీతంలాంటిదని, రాబోయే వినాశనాన్ని ఎదుర్కొని ఆశను నిలుపుకునే శక్తిని అందిస్తుందని అన్నారు. పుస్తకాన్ని మరింత మందికి బుకర్ చేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బహుమతి కింద 50వేల పౌండ్లు మాతృక రచయిత, అనువాదకులకు సమానంగా అందించబడుతుంది.










