Mar 30,2023 22:07

ఉదయగిరి బస్టాండ్‌ సెంటర్‌లో కుర్చీలో కూర్చోని సవాల్‌ విసురుతోన్న మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి :సింహపురిలో రాజకీయ తుపాన్‌ సాగుతోంది.. ఇప్పుడు వాయుగుండం ఉదయగిరి వైపు సాగినట్లు కనిపిస్తోంది. రెండు, మూడు రోజుల నుంచి వైసిపి నుంచి బహిష్కరణకు గురైన ఎంఎల్‌ఎ మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిపై వైసిపి అధిష్టానం పక్కా వ్యూహంతో వ్యవహరిస్తుంది. ఆయనకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో ఆందోళనలు చేపట్టింది. బెంగుళూరు నుంచి వచ్చిన చంద్రశేఖర్‌రెడ్డి మీడియాలో వైసిపి, ముఖ్యమంత్రి జగన్‌, సజ్జల రామకృష్ణారెడ్డిపై విరుచుకుపడుతున్నారు. ఇటీవల కొందరు నేతలు ఉదయగిరి వస్తే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిని చెప్పులతో కొడతామంటూ హెచ్చరించారు. దీనిని సీనియర్‌గా తీసుకున్న ఆయన గురువారం సినిమా స్టైల్‌లో ఉదయగిరి బస్టాండ్‌ సెంటర్‌లో కుర్చివేసుకొని కుర్చున్నారు. ''ఏవరు వస్తారో రండిరా '' అంటూ సవాల్‌ విసిరారు. ఉదయగిరిలో కొంత టెన్షన్‌ వాతావరణ నెలకొంది.
వైసిపి నుంచి బహిష్కరణకు గురైన ఎంఎల్‌ఎ మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి వైసిపిపై ఒంటికాలిపై లేస్తున్నారు. 2024 ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా చంద్రశేఖర్‌రెడ్డికి చెప్పినప్పటి నుంచి ఆయన అసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సి ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. టిడిపి అభ్యర్థి అనునాధ గెలిచింది. ఆరోజు విజయవాడ నుంచి నేరుగా బెంగుళూరు వెళ్లారు. తన కుమార్తె పరీక్షలు ఉండడంతో ఆయన అక్కడే ఉండిపోయారు. వైసిపి అధిష్టానం మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. ఇదే అదునుగా భావించిన ఆయన వ్యతిరేకులు రెచ్చిపోయారు. మాజీ ఎంపిపి చేజర్ల సుబ్బారెడ్డి బెంగుళూరులో ఉంటున్నారు. గత శుక్రవారం ఉదయగిరి బస్టాండ్‌ సెంటర్‌లో సుబ్బారెడ్డి తన అనుచరులతో హల్‌చల్‌ చేశారు. మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిని అసభ్య పదజాలతో తిట్టడంతోపాటు, ఉదయగిరి వస్తే చెప్పులతో కొడతారంటూ హెచ్చరించారు. వైసిపి నుంచి బయటకు వంపడంతో ఇక్కడ నుంచి టికెట్‌ ఆశిస్తున్న నేతలు చంద్రశేఖర్‌రెడ్డిపై రెచ్చిపోయారు. నెల్లూరు ఎంఎల్‌ఎ అనిల్‌కుమార్‌యాదవ్‌కు విమర్శలు చేశారు. ఉదయగిరిలో ఏం జరుగుతుందోననే ఆసక్తి ప్రజల్లో నెలకొంది. మూడురోజుల క్రితం మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మర్రిపాడు వచ్చారు. మీడియా ఇంటర్వ్యూలతో వాతావరణ వేడెక్కింది. ఏమాత్రమూ భయపడకుండా ప్రభుత్వం, సిఎం పై విమర్శలు చేస్తున్నారు. ఇదే క్రమంలో వైసిపి అధిష్టానం ఆయనను కట్టడి చేయడానికి ప్రయత్నాలు చేస్తునట్లు తెలుస్తోంది. అవసరమైతే ఎస్‌సి, ఎస్‌టి కేసులు పెట్టాలంటూ ఆదేశాలు జారీ చేసిందని మేకపాటి ఆరోపిస్తున్నారు. ఒక్కసారిగా ఉదయగిరి అంశం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని అందరి చూపు ఉదయగిరి వైపు చూస్తున్నారు. ఇక్కడ ఇన్‌ఛార్జ్‌, పోస్టు కోసం ఆపార్టీ నేతలు క్యూ కడుతున్నారు. ఎవరు ఎక్కువ మాట్లాడితే వారికి అదిష్టానం టికెట్‌ ఇస్తుందని ఆశపడుతున్నారు. అందుకే సుబ్బారెడ్డి గత కొంత కాలంగా మేకపాటిపై విమర్శలు చేస్తున్నారు. మేకపాటి వ్యతిరేకంగా వైసిపి అధిష్టానం పక్కా వ్యూహంతో వ్యవహరిస్తుంది. ఆయనను ఇరుకున పెట్టడానికి ప్రయాత్నాలు చేస్తుంది.
ఉదయగిరి సెంటర్‌లో హల్‌ చల్‌..!
రాజకీయాల్లో విమర్శలు సహజం. మీ ఊరికొస్తా....మీ సెంటర్‌ కొస్తా....నన్ను రమ్మంటావా ? నువ్వు వస్తావా ? అంటూ విమర్శలు చేసుకుంటారు. ఇటీవల వైసిపి నేత చేజర్ల సుబ్బారెడ్డి ఉడయగిరి సెంటర్‌లో మేకపాటికి సవాల్‌ విసిరారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న ఎంఎల్‌ఎ మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి గురవారం ఉదయగిరి సెంటర్‌ను తన అనుచరులతో వెళ్లారు. కుర్చి తెప్పించుకు వేసుకొని కుర్చున్నారు. '' ఎవడు రా నన్ను వస్తే తరిమికొడతానంది...దమ్ముంటే రండి...ఉదయగిరిలో అభివృద్ధి చేసింది నేను. నాలుగు సార్లు ఎంఎల్‌ఎని తాడు బొంగరం లేని వాళ్లు నన్ను విమర్శిస్తున్నారు. '' అంటూ హల్‌చల్‌ చేశారు. కొద్దిసేపు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియలేదు. మేకపాటి అనుచరులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఈ పరిణామాలు ఒక్కసారిగా ఉదయగిరిలో వేడెక్కాయి. మేకపాటి రాజమోహన్‌రెడ్డి సహకారం లేకపోవడంతో ఎవరి మద్దతు ఉండదనే ధోరణిలో వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. వైసిపి అధిష్టానం ఓ వైపు ఆపార్టీ నేతలను, మరో వైపు పోలీసులను ఆయనకు వ్యతిరేకంగా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పరిణామాలు ఇలా ఉంటే ఆయనను ఏదొక కేసు పెట్టి అరెస్ట్‌ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల గుండెకు సంబందించిన చికిత్స తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వైసిపి ఆచీతూచీ వ్యవహరిస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉదయగిరి నియోజకవర్గంలో టెన్షన్‌ వాతావరణ నెలకొంది. మేకపాటితో ఎవరు కలిసి వస్తున్నారు. వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి. వ్యతిరేకిస్తే ఏం ఉపయోగం అనే కోణంలో నేతలు, కార్యకర్తలు ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి. ఈ పరిణామాలు జిల్లాతోపాటు, రాష్ట్ర వ్యాపితంగా చర్చినీయాంశమయ్యాయి.