ప్రజాశక్తి - పరిగి : మండల వ్యాప్తంగా మట్టి మాఫియా బరితెగించింది. మాఫియా వ్యవహారం రోజు రోజుకు శృతి మించుతంది. వీరి ఆగడాలను అడ్డుకోవడానికి అధికారులు కూడా వెనకంజ వేస్తున్నారన్న విమర్శలు వినపడుతున్నాయి. మండలంలో ఇటుక వ్యాపారానికి పెట్టింది పేరు. ఇటుకల తయారీకి మట్టి అవసరంఉంది. ప్రభుత్వం మట్టి తరలింపుపై ఆంక్షలు విధించడం వల్ల కొందరు గుత్తదారులుగా వ్యవహరించి వ్యాపారులతో ఒప్పందాలు కుదుర్చుకొని మట్టి తరలింపు కార్యక్రమాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. మండలంలోని శాసనకోట పొలం 381-2 సర్వేనెంబర్ కుంట ప్రాంతంలోని మట్టిని సోమవారం అక్రమంగా తరలించారు. మట్టి తరలింపుపై ఇటీవల ఉన్నత స్థాయి అధికారి జెసిబి, ట్రాక్టర్లు, టిప్పర్ల యజమానులతో సమావేశం నిర్వహించి అందుకు సంబంధించిన విధి విధానాలు తెలియజేశారు. ఇందులో భాగంగా తప్పనిసరిగా అనుమతులు తీసుకునే మట్టిని తరలించాలని హెచ్చరించారు. అయితే అది గడిచి వారం కాకమునుపే ట్రాక్టర్లతో కాకుండా ఏకంగా టిప్పర్లనే మట్టి తరలింపునకు మాఫీయా వాడుతోంది. మాఫియా చర్యలు అధికారులకు సవాల్ విసిరినట్లు ఉందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మట్టి తరలింపు పై ఇరిగేషన్ అధికారులను వివరణ కోరగా తాను విజయవాడ హైకోర్టు పనిమీద ఉన్నానని ఇక్కడి సమస్యను పరిష్కరించాలని స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదని అన్నారు.ఇరిగేషన్ అధికారులకు స్థానిక అధికారులు సహకరించాలని అలాంటిది మండలంలో ఈ విధానం కొరవడిందని అన్నారు. ఇదిలా ఉండగా మట్టితరలింపును అధికారులు అడ్డుకుంటే అంతు చూస్తానని టిప్పర,్ జెసిబి యజమానులు అధికారులను బెదిరిస్తున్నారన్న ఆరోపణలు వినపడుతున్నాయి.










