Jun 30,2022 07:05

గడ్డి పోగుల్ని ఒళ్ళు నిండా కప్పుకుని
వెచ్చగా నిద్రపోతాంది పొలం
రాళ్ళ సవ్వడి సంగీతానికి
ఉట్లగడ్డి తలూపతాంటే
గడ్డిపువ్వు పళ్ళికిలిత్తా నవ్వుతాండాది
రైతు వచ్చేది లేదు
మడక పట్టి దున్నేది లేదు
పిచ్చి మొక్కల యుద్ధ భేరికి
నేల బీటలువారి పోతాంటే
గాలి విసురు దుమారం పక్కుమంది
సంచుల్లో విత్తనాలు
ఊపిరాడక పుచ్చిపోతాంటే
చీడ పురుగు నాట్యమాడుతాంది
అరువు కరువు కాలనాగై
బుసలు కొడతా మీదికెగబడతాంటే
కర్షక బొందిలో పాణం
గుటకలు మింగుతా కూచుండాది
కొయ్యబొమ్మ లెక్కన నేటి పాలన
తెర చాటున తొంగిచూత్తాంటే
దిక్కుతోచని స్థితి మంచమెక్కినాది
మొహం కడగని బీడు సెలకలు
పాలిపోయినట్టు కనిపిత్తాంటే
సాలళ్ళ గొంతు ఎండిపోయిండాది
గుబురు గుట్టలన్నీ నిండుగా
పరక ఊసలు బాదం పీచుతో
ఉరకలేత్తా ఎగబడి పోతాంటే
బీడు సెలక గుండె బరువెక్కినాది
ముంగారు కాలం మీదికొచ్చినా
అదును చేయలేని సగటు బతుకు
ఆవులిస్తా ఓ మూలకు ఒరిగిపోతాంటే
కాలం పకపకా నవ్వేసినాది
వాన కార్తి మేఘాల్ని వెంటేసుకుని
సైనికాధికారిలా శంఖం పూరిస్తాంటే
డొల్ల జేబు రైతు బతుకు
భోరున విలపిత్తాండాది.
- నరెద్దుల రాజారెడ్డి,
సెల్‌ : 9666016636