Aug 29,2022 07:19

అందలం ఎక్కిన రాబందుల రెక్కల చప్పుడు
ఇప్పుడైనా వినిపిస్తుందా?
నువ్వు కూర్చున్న చోటే కాదు;
అన్ని చోట్లా అదే భయంకరమైన మరణ మృదంగం
ఆ చప్పుడు చేసే వాడికి విలాసాల వికటాట్టహాసం
వింటున్న వాళ్ళకి ఒళ్లు గగుర్పొడిచే విలాప కృత్యం
వర్తమాన వాస్తవిక దృశ్యం
నీ హృదయాన్ని ముక్కలు చేయలేదా?
నువ్విచ్చిన అధికారం నీపై పడగై
బుసలు కొట్టటం వినిపించటం లేదా?
నీవైపు హేళనగా చూస్తూ
నిన్నే భీతావహం చేస్తూ బరితెగించటం లేదా?
ఇంత జరుగుతున్నా సరే నిస్సిగ్గుగా
అందర్నీ ఏమార్చి నువ్వు వాడికి చేసే ఊడిగం విలువ
నువ్వు తాకట్టు పెట్టిన నీ ఆత్మ గౌరవం!
తాత్కాలిక లాభం మత్తులో
నువు చేస్తున్న బానిసత్వానికి
వాడు వెల కట్టేది రేపటి నీ పిల్లల భవితవ్యం
మరువకు మిత్రమా, నీకు చివరకు మిగిలేది నీ పతనం!
- సునీత గేదెల
89859 09040