ఎవరో ఎగరమంటే ఎగరడానికీ
వీధుల్లో అరవడానికీ వారేం కిరాయి
జెండాలు మోసే తురాయిలు కారు
చదువు లేకనే పదవులందే మంత్రులూ కారు
విద్యార్హతలతో నెగ్గి కొలువైన ఉద్యోగులు
చెప్పిన మాట తప్పి మడమ తిప్పితేనే
కుప్పిగంతుల వంకర తోకలు సరి చేస్తూ
సమ్మె కట్టారూ పోరుబాట పట్టారు
వారు ఎన్నికల వాగ్దానాల మూట విప్పి
సంధించే శరాలకు మతి చలించి
ఆడలేక ఓటి మద్దెల మాటలు జారుతున్నారు
శ్రమకు పెట్టే కోతే సిరిపరుల సంపద
కోత గుండె కోతైతే లేచేదే శ్రముల పిడికిలి
కోత తగ్గింపుకూ శ్రమ వాటా పెంపుకూ
కష్ట జీవులు పట్టే ఆయుధమే సమ్మె
చికాగో సమ్మె రక్తపాత చిహ్నమే ఎర్రజెండా
అందుకే అదంటే సిరిపరులకే కాదు
వారి కాపరులకూ కలవరం, కంపరం
ఎర్రగుడ్డ చూస్తే దొంగబిడ్డ బెదురు గొడ్డేగా
ఎన్నికల ముందు అన్నలైన టీచర్లను
ఇప్పుడు దున్నల్లా చూస్తున్నారా?
గృహం, స్కూళ్లను బందెలదొడ్లుగా చేసి
పోలీసులతో నిర్బంధాలకు దిగారు
గుర్తుంచుకోండి టీచర్లంటే
ప్రేమతో బోధించే గురువులే కాదు
దారి తప్పితే దండించడమూ తెలిసినోళ్ళు
మాట తప్పకుండా, మడమ తిప్పకుండా
నువ్వు విన్నావూ నువ్వున్నావూ అనిపించుకో.
- వివి,
రిటైర్డ్ జర్నలిస్ట్










