Feb 07,2023 09:48

అర్జీల పరిష్కారంపై అధికారులతో మాట్లాడుతున్నకలెక్టర్‌ బసంత్‌కుమార్‌

           పుట్టపర్తి అర్బన్‌ : స్పందనలో వచ్చే అర్జీల పరిష్కారంపై నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు వాటికి పరిష్కారం చూపాలని కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో స్పందన అర్జీలను స్వీకరించారు. 173 అర్జీలు ప్రజలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలోని అధికారులతో వివిధ అంశాలపై మాట్లాడారు. సమస్యల పరిష్కారం నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ప్రజలు స్పందనకు వస్తారన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సకాలంలో సమస్యలు పరిష్కరించాలన్నారు. గహ నిర్మాణం, ఉపాధి హామీ పథకంలో పురోగతి సాధించాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టిన జగనన్న ఇళ్లు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రాధాన్యత గల ప్రభుత్వ భవన నిర్మాణ పనులనూ వేగవంతం చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్ర భవనాలను వెంటనే పూర్తి చేయాలన్నారు. నాడు-నేడు కార్యక్రమంలో పాఠశాలల్లో చేపట్టిన పనులు పూర్తి చేయాలన్నారు. ఆధార్‌కార్డు వంద శాతం అనుసంధానం చేసే ప్రక్రియ ఈనెల 7వ తేదీ నుంచి ప్రారంభం చేస్తున్నామన్నారు. ముఖ ఆధారిత హాజరు విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఇంకా చాలామంది ఈ విధానాన్ని నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ కొండయ్య, ఆర్డీవో భాగ్యరేఖ, డిఎంహెచ్‌ఒ కష్ణారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటరామిరెడ్డి, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, సిపిఒ విజరు కుమార్‌, డిపిఒ విజరు కుమార్‌ పాల్గొన్నారు.