ఇంటిని చూసిన ప్రతిసారీ
మా ముత్తవ్వల శిధిల స్వప్నాలు గుర్తొస్తాయి
అడుగడుగునా నిక్షిప్తమైన
ఆశల ఆనవాళ్లు పలకరిస్తాయి
గాయాల గనులైన
తల్లుల అలసిన మనసులు తలపుకొస్తాయి
సర్వస్వాన్ని దోచుకొని
అందంగా ముస్తాబైన ఇల్లు
ఏ స్వాతిచినుకు చేరని మరీచికలా ఉంది
చేతివేళ్ళ నైపుణ్యాన్ని తనలో నింపుకొని
రంగులీనుతూ మెరిసిపోతుంది
ఇంటిలోని గదులన్నీ
వాళ్ళ కోరికల్ని హత్య చేయబడిన
వైనాన్ని విశదీకరిస్తాయి
గాజుగోళ్ళాల్లా పగిలిన కలలు
ఒంటరి రాత్రుల్లో హదయ విదారక
విషాద గీతాలను ఆలపిస్తాయి
వంటింటి గాడిపోయిలలో
భస్మంగా మారిన స్వప్నాల కమురు వాసన
ఇంకా పచ్చిగానే ఉంది
పడక గదుల సాక్షిగా
మొదలంటూ నరకబడిన
ఆశల రెక్కలు కాలగర్భంలో
కథలై పదిలమై ఉన్నాయి
వాళ్ళ కలల సమాధుల్లో
పురుడుపోసుకున్న ఇల్లు
ఏ బ్రహ్మజెముడూ మొలకెత్తని
అనామక ప్రదేశంలా అనిపిస్తుంది!
- కడెం లక్ష్మీ ప్రశాంతి
78933 99773










