నువ్వు తెగిన గాలిపటం అంటావు
నేను రెక్కలు విచ్చుకొని
ఎగిరే పతంగం అంటాను
రాత్రి ఉన్నది రాత్రి కొరకే అంటావు
రాత్రి లేనిదే
పగలకు అర్థం లేదంటాను
నాకు జైలు అన్నది
నీకు అదే ఆరుబయలు
తూర్పు పడమరలు
ఎప్పుడూ అభిముఖమే!
జీవితం బహుదూరపు ప్రయాణం
కన్నీళ్లు - ఆనంద భాష్పాలు
రెండు ఒక్కటి కానట్టే
నాలుగు గోడలు ఉన్నంతనే
గది కాదు
అది ఇల్లు అసలే కాదు
అయినా
ఇప్పటికి ఇది అంతే
నువ్వు ఒక్క నువ్వే!
ఒక ఒడ్డు
ఒక పార్శ్వం
నేను మాత్రం పొంగిపొర్లిపోకుండా,
పరిగెత్తే ప్రవాహానికి
రెండు చేతుల అడ్డుకట్టను
నీతో నడిచే కాలపు చెలియల కట్టను
కలగలిసిపోయిన పాలు నీళ్లలో
ఎప్పుడో జారిపోయిన
కన్నీటి బొట్టును
నీ అంతర్గత బహిర్గత రహస్యాలు
అంతరంగంలో దాచుకొనే .... నేననేకం!
- లోసారి సుధాకర్
99499 46991










