Apr 26,2022 18:51

తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని మరక్కానం పట్టణ పంచాయతీలో సుమతి వాళ్ల అంగన్‌వాడీ కేంద్రం ఉంది. పదేళ్ల క్రితం స్థాపించిన ఈ అంగన్‌వాడీ కేంద్రానికి నిధులు కేటాయించకపోవడంతో కాంట్రాక్టు కార్మికుల సహాయంతో ఆరేళ్లు నడిచింది. వారు, పిల్లలకు భోజనం బయటి నుంచి తెప్పించేవారు. సరైన మంచినీటి కనెక్షన్‌ ఉండేది కాదు. మరుగుదొడ్డికి తలుపులు కూడా లేవు. ఈ కేంద్రానికి దగ్గర్లోని గిరిజన తాండా ప్రాంత పిల్లలు వస్తారు. వారికి ఇంట్లో సరైన పోషకాహారం అందించే స్థోమత వారి తల్లిదండ్రులకు లేదు. దీంతో వారు తమ పిల్లలను ప్రత్యేక శ్రద్ధతో అంగన్‌వాడీ కేంద్రానికి పంపిస్తారు. అయితే సుమతి నాలుగేళ్ల క్రితం ఈ కేంద్రం బాధ్యతలను తీసుకున్నారు. ఉపాధ్యాయురాలిగా రూ.15 వేల జీతం తనకు సరిపోదని తెలుసు. అయినా పరిస్థితులన్నీ తెలిసి ఆ కేంద్రం నిర్వహణ బాధ్యతలను తీసుకున్నారు. శిథిలావస్థలో ఉన్న అంగన్‌వాడీని మార్చేందుకు కృషి చేశారు. ఫలితంగా గ్రామీణ శిశు సంరక్షణ కేంద్రం ఇప్పుడు ఆ ప్రాంతంలోనే మోడల్‌ అంగన్‌వాడీగా నిలిచింది.

వారే తన పిల్లలు
మూడు సెంట్లలో ఏర్పాటు చేసిన అంగన్‌వాడీని స్థాపించినప్పటి నుంచి అధికారులు ఎవరూ శ్రద్ధ చూపకపోవడంతో పాఠశాల ప్రాంగణంలో పిచ్చి మొక్కలు బాగా పెరిగాయి. దాంతో పాములు తరుచూ కనబడుతూ ఉంటాయి. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులకు తమ పిల్లల్నీ పంపించడం మానేశారు. సుమతి బాధ్యతలు చేపట్టాక ఒక్కొక్క సమస్యనూ చక్కదిద్దుకుంటూ వచ్చారు. మొదట పాఠశాల ప్రాంగణం మొత్తం శుభ్రం చేయించారు. ముందు, వెనక ఉన్న ఖాళీ ప్రదేశం దున్నించి కూరగాయల మొక్కలు నాటింది. చిక్కుడు, బెండ, టొమాటోలు, ఆనబకాయలు, పొట్లకాయలు, మొక్కజొన్న, వంకాయలు వంటివి అక్కడే పండిస్తుంది. ఇంకా రెండు మూడు రకాల ఆకుకూరలు కూడా. వాటితోనే ప్రతిరోజూ పిల్లలకు వండిపెడుతుంది. ప్రస్తుతం 30 మంది చిన్నారులు ఉన్న అంగన్‌వాడీలో 12 మంది గిరిజన పిల్లలే! వారందరి కోసం సుమతి అన్నం వండి పెడుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే బియ్యం, పప్పు, నూనె, కోడిగుడ్లు నెలంతా రావు. అయినా కూరగాయల కోసం ఇస్తున్న డబ్బుతో సరుకులు కొనుగోలు చేస్తున్నారు. హెల్పర్‌ సహాయంతో సుమతి ఆ పిల్లలను కన్నతల్లిలా చూసుకుంటోంది. విద్యాబుద్ధులు నేర్పుతోంది.

ఆమె అమ్మలాంటి అంగన్‌వాడీ
సెలవు రోజుల్లోనూ ...
పిల్లలు కూర్చునేందుకు చిన్న సైజు కుర్చీలు తెప్పించారు. వంట పాత్రలు కొనుగోలు చేశారు. స్కూలుకి పెయింటింగ్‌ వేయించి, చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. ఈ పనులకు గానూ లక్షన్నరకు పైగా ఖర్చయింది. సుమతి ఇవన్నీ ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో చేయించలేదు. తన బంగారు గొలుసు తాకట్టు పెట్టి ఆ డబ్బుతో చేయించారు. తనకి వస్తున్న జీతంలో సగం పిల్లల కోసం వెచ్చిస్తున్నారు. వారు ఆడుకునేందుకు రకరకాల ఆట బొమ్మలను వారి ముందుంచారు. పలకలు, పుస్తకాలు, పెన్సిళ్లను వారికి అందుబాటులో ఉంచారు. వీడియోల ద్వారా వారికి రైమ్స్‌, కథలు నేర్పడానికి సెకండ్‌ హ్యాండ్‌ టెలివిజన్‌, డివిడి ప్లేయర్‌ని కొనుగోలు చేశారు. అంగన్‌వాడీకి వస్తున్న పిల్లలే తన పిల్లలుగా చూసుకుంటున్నారు. వారి కోసం సెలవు రోజుల్లో కూడా కేంద్రానికి వచ్చి, తాను వండిన పిండి వంటలను పంచిపెడుతారు.
మదర్‌ థెరిస్సా నా రోల్‌మోడల్‌ : సుమతి
మాది రైతు కుటుంబం. వ్యవసాయంలో కష్టనష్టాలు తెలుసు. ఆకలితో ఉన్న ముఖాలు ఇట్టే అర్థమవుతాయి. అందుకే ఆ పేదపిల్లలు ఆకలి బాధలు చూడలేకపోయాను. వారందరి కోసం ఈ అంగన్‌వాడీ కేంద్రాన్ని నిర్వహణ బాధ్యతలు తీసుకున్నా. మధర్‌ థెరిస్సానే నా రోల్‌మోడల్‌. మా అమ్మమ్మ నిత్యం అన్నదానం చేస్తూ ఉంటారు. అది చూసి పెరిగిన నాకు పెద్దయ్యాక నేను అలా చేయాలనుకునేదాన్ని. ఆమే నాకు ప్రేరణ.