భారత స్వాతంత్య్రం కోసం గెరిల్లా యుద్ధరీతిలో పోరాడిన విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు. ఈరోజు ఆయన 125వ జయంత్యుత్సవం. బ్రిటిషు ప్రభుత్వాన్ని ఎదిరించి సాయుధ పోరాటం చేసి తనను నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన మహౌజ్వల శక్తి అల్లూరి. రెండేళ్ల పాటు బ్రిటిష్ పాలకులకు కంటిమీద కనుకు లేకుండా చేశారు. మన్య ప్రజల హక్కుల కోసం, దేశస్వాతంత్య్రం కోసం పోరాడి 1924 మే 7వ తేదీన ఆయన 27 ఏళ్ల చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన వీరుడు అల్లూరి.
జులై 4, 1897న విశాఖ జిల్లా పాండ్రంగిలో అమ్మమ్మ గారింట పుట్టిన శ్రీరామరాజు... వెంకట రామరాజు, సూర్యనారాయణమ్మ దంపతుల తొలి సంతానం. రాజు తండ్రి రాజమండ్రిలో స్థిరపడి, ఫొటోగ్రాఫరుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. 1908లో గోదావరి పుష్కరాల సమయంలో ప్రబలిన కలరా వ్యాధికి గురై రాజు తండ్రి మరణించాడు. పిన్న వయసులోనే తండ్రిని కోల్పోవడం రాజు జీవితంలో పెనుమార్పులకు కారణమైంది. ఏ బడికి పంపించినా ఎక్కడా కూడా సరిగా చదివేవాడు కాదు. 1916 ఏప్రిల్ 26న కాలినడకతో తన యాత్రను ప్రారంభించిన సీతారామరాజు నర్సీపట్నం, చోడవరం, విజయనగరం మీదుగా వెళ్లి ఉత్తర భారతదేశ యాత్ర చేశాడు. కలకత్తాలో సురేంద్రనాథ్ బెనర్జీతో పరిచయం ఏర్పడింది. వారి ఇంటికి వస్తున్న ప్రముఖ జాతీయ నాయకులైన మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్, మాలవీయ వంటి వారిని కల్సి దేశ పరిస్థితిని గురించి చర్చించేవారు. 1917 జూలైలో విశాఖ జిల్లాలోని కృష్ణాదేవిపేట చేరుకున్నారు రాజు. 1918 జూన్‌లో ఉత్తరదేశ యాత్ర చేశాడు. 1919 ఏప్రిల్లో కృష్ణదేవిపేట సమీపంలో తాండవ నది ఒడ్డున ఒక చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసి వ్యవసాయం చేయడానికి చిటికెల భాస్కరుడు సహాయం చేసాడు. సీతారామరాజు అక్కడే ఒక పాఠశాలను నిర్మించాడు. ఆ పాఠశాలలో రాత్రి తరగతులు నిర్వహించి గిరిజనులకు విద్య నేర్పించాడు.
1921 జులైలో చిట్టగాంగ్‌లో జరిగిన విప్లవకారుల రహస్య సమావేశంలో రాజు పాల్గొన్నారని చెబుతారు. మన్యంలో గ్రామ పంచాయతీల ద్వారా ప్రజల మధ్య ఉండే సమస్యలను పరిష్కరించుకునేలా ఏర్పాటు చేశాడు. గిరిజనులను ఒకతాటిపైకి తెచ్చి, వారిని దురలవాట్లకు దూరంచేసి, గెరిల్లా యుద్ధ పద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేశాడు.
అత్యంత క్రూరుడైన చింతపల్లి తహసీల్దారు బాస్టియన్ కూలీలపై చేసే అఘాయిత్యాలపై రామరాజు అధికారులకు ఫిర్యాదు చేసాడు. కానీ, ప్రభుత్వం ఏ చర్యా తీసుకోలేదు. రామరాజు గిరిజనులను కూడగట్టి విప్లవం తీసుకువచ్చే సన్నాహాల్లో ఉన్నాడని బాస్టియన్ పై అధికారులకు నివేదిక పంపాడు. అప్పటికే గిరిజనుల్లో కలుగుతున్న చైతన్యాన్ని గమనించిన ప్రభుత్వం రాజును గిరిజనులకు దూరంగా ఉంచాలని, నర్సీపట్నంలో కొన్నాళ్ళు, అడ్డతీగల సమీపంలోని పైడిపుట్టలో కొన్నాళ్ళు ఉంచింది. పైడిపుట్టలో 50 ఎకరాల భూమిని వ్యవసాయ నిమిత్తం ఇచ్చింది.పోరాట సన్నాహాలు నూర్తయ్యాక రామరాజు ఆ భూమిని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేశాడు.
గంటందొర, మల్లుదొర, మొట్టడం వీరయ్యదొర, కంకిపాటి ఎండు పడాలు, సంకోజి ముక్కడు, గోకిరి ఎర్రేసు, బొంకుల మోదిగాడు వంటి సాహస వీరులు 150 మంది దాకా రామరాజు అనుచరులుగా చేరారు. 1922 ఆగష్టు 22న చింతపల్లి పోలీసు స్టేషనుపై దాడిచేసి ఆయుధాలు సేకరించారు. మరుసటి రోజు కృష్ణదేవి పేట పోలీసు స్టేషనుపై దాడిచేశారు. ఆగష్టు 24న - వరుసగా మూడవ రోజు - రాజవొమ్మంగి పోలీసు స్టేషనుపై దాడి చేసారు. అక్కడ బందీగా ఉన్న వీరయ్య దొరను విడిపించారు. ఈ మూడు దాడుల్లో మొత్తం 26 తుపాకులు, 2500కు పైగా మందుగుండు సామగ్రి, బయినెట్‌లు, కత్తులు, ఇతర సామగ్రినిస్వాధీనం చేసుకున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఏమేం తీసుకువెళ్ళారో రికార్డు పుస్తకంలో రాసి, రాజు సంతకం చేసాడు.
వరుస దాడులతో దెబ్బతిని ఉన్న బ్రిటీషు ప్రభుత్వం విప్లవ దళాన్ని అంతం చెయ్యడానికి కబార్డు, హైటర్ అనే అధికారులను నియమించింది. సెప్టెంబర్ 24న రాజు దళం గెరిల్లా యుద్ధరీతిలో వీరిపై దాడిచేసి, అధికారులిద్దరినీ హతమార్చింది. అక్టోబర్ 23న ప్రత్యేక సైనిక దళాలతో వచ్చిన సాండర్స్ అనే సేవాని దళంతో రాజు దళానికి ముఖాముఖి యుద్ధం జరిగింది. పరిస్థితులు అనుకూలంగా లేవని సాండర్స్ వెనుదిరిగాడు. అక్టోబర్ 15న అడ్డతీగలపై, అక్టోబర్ 19న చోడవరం స్టేషన్‌పై, డిసెంబర్ 6న పెద్దగడ్డపాలెం, లింగా పురం అనేచోట్ల రాజుదళం వారితో తలపడవలసి వచ్చింది. ఇరు వర్గాల మధ్య భీకర పోరాటమే జరిగింది. రెండుచోట్ల కలిపి 8 మంది రాజు అనుచరులు వీరమరణం చెందారు.
ఏప్రిల్ 17, 1923న రామరాజు దళం ఆకస్మాత్తుగా అన్నవరం పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమై మొత్తం యంత్రాంగాన్ని కలవరపరిచింది. ఈ సంఘటన తరువాతఉద్యమంలోకి వేగిరాజు సత్యనారాయణ రాజు (అగ్గిరాజు) వచ్చారు. ఆ ఏడాది సెప్టెంబర్ 17 రాత్రి మల్లుదొర దొరికిపోవడం ఉద్యమానికి నష్టం కలిగించింది. ఆ ఏడాది డిసెంబర్‌లో కాకినాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు రామరాజు మారువేషంలో హాజరయ్యారు.
రామరాజును పట్టుకోవడానికి బ్రిటీషు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. రామరాజు ఎంచుకున్న రహస్య స్థావరాలు అటువంటివి. మంపవద్ద దారుకొండ, గాముకొండ, ముకొండ లోయలోని గుహలు మంచి రక్షణ కల్పించాయి. పోలీసులు 1923, నవంబరు 5వ తేదీన కొండాలయ్య గొండి రహస్య స్థావరంపై దాడి చేశారు. ఆ స్థావరంలో చిన్న మంచం, ఒక బెంచి, నర్సీపట్నం పోలీసు అధికారులు జారీ చేసిన రెండు ఉత్తర్వుల కట్టలు, భారత శిక్షాస్మృతి పత్రాల కాపీలు, ఒక చేలాంతరు దొరికింది. దీనిని బట్టి సీతారామరాజు ప్రభుత్వ ఉత్తర్వులను, ప్రభుత్వ కార్యాలయాల నుంచి రహస్యంగా తెప్పించి చదివేవాడని, న్యాయ శాస్త్రానికి సంబంధించిన పత్రాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించేవాడని అర్థమవుతుంది.
1924 జనవరిలో అస్సాం రైఫిల్స్ దళం దిగింది. ఈ అస్సాం రైఫిల్స్ అధిపతే మేజర్ గుడాల్. 17-4-1924న మన్యానికి కలెక్టరు (స్పెషల్ కమిషనర్)గా రూథర్ ఫర్డ్ నియమితుడయ్యాడు. ఏప్రిల్ నుంచి జూన్ 24 వరకే అతడి అధికారం. అంతలోనే ఉద్యమం అణగిపోవాలి. దీంతో, మన్యం పోలీసు హింసతో, అత్యాచారాలతో తల్లడిల్లిపోయింది. రామరాజును పట్టుకోవడానికి మన్యంలో బ్రిటిషు ప్రభుత్వం అనేక వ్యూహాలు పన్నింది. మన్యం వాసులు ఎవరైనా రామరాజు గురించి సమాచారం అందించినా లేదా పట్టుబడటానికి సహకరించినా, వారికి నగదు బహుమతిని అందజేస్తామని ప్రకటించింది. అయినా మన్యం వాసులు ఎవరూ దానికి స్పందించలేదు. ఈ వ్యూహం ఫలించకపోయే సరికి, రెండవ వ్యూహంగా మన్యం వాసులపై వివిధ కేసులు పెట్టి, అరెస్టు చేసి జైల్లో నిర్బంధించారు. గ్రామ మునుసబులను భయపెట్టినా ఎవరూ సీతారామరాజు ఆచూకీ గురించి చెప్పలేదు. ముఠాదారులు ప్రజాదళాలకు సహాయం చేశారనే నేరం మోపి జైల్లో వేశారు. అలా శిక్షించిన వారిలో చిట్టెంపాడు గ్రామ మునసబు గంగరాజు, మాడుగుల ముఠాదారు, దామనపల్లి మునసబు ఉన్నారు. మల్లుదొర ఊరిలోకి వచ్చాడని తెలియజేయనందుకు మరో నలుగురు గ్రామ మునుసబులకు జరిమానా, జైలుశిక్ష విధించారు. 1923 సెప్టెంబరులో మాకవరం ముఠాలోని గ్రామ మునుసబులందరిని పిలిపించిన రంప డిప్యూటీ తహసీల్దారు రామరాజు గురించి సమాచారం అందించకపోతే మరింత కఠినంగా వ్యవరిస్తామని హెచ్చరించాడు. వారం రోజుల్లో విప్లవకారుల ఆచూకీ తెలియజేయకపోతే ప్రజలను కాల్చివేస్తామని కృష్ణదేవి పేట సభలో రూథర్ ఫర్డ్ నిర్దాక్షిణ్యంగా ప్రకటించాడు. తన వల్ల మన్యం ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారోనని, వారిని ఈ బాధలనుండి విముక్తి ప్రసాదించడానికి తాను లొంగిపోవాలని రామరాజు నిశ్చయించుకున్నాడు. తన సమాచారం ప్రభుత్వానికి ఇమ్మని ఒక మునసబును రామరాజు కోరినా, అటువంటి నీచమైన పని చేయజాలనని ఆ మునసబు తిరస్కరించాడు. 1924 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలో ఓ పశువుల కాపరి ద్వారా రాజు తాను ఉన్న చోటు గురించి పోలీసులకు కబురు పంపాడు. పోలీసులు చుట్టుముట్టి ఆయన్ని బంధించారు. ఒక నులక మంచానికి కట్టి, గిరిజనుల చేతనే మోయిస్తూ కృష్ణదేవిపేటకు పయనమయ్యారు. కొయ్యూరు వద్ద మేజర్ గుడాల్ రాజును కట్టిన మంచాన్ని దింపించాడు. అక్కడే రామరాజుకు, గుడాల్‌కు మధ్య వాగ్యుద్ధం జరిగింది. ఆగ్రహించిన గుడాల్ ఎలాంటి విచారణ జరపకుండాను రామరాజును చింతచెట్టుకు కట్టి కాల్చి చంపాడు. రాజు ఎక్కడైతే ఉద్యమకారునిగా రూపొందాడో ఆ కృష్ణదేవిపేటలోనే తాండవ నది ఒడ్డున ఆయనకు అంత్యక్రియలు జరిపారు. తరువాత జరిగిన సంఘటనల్లో కొందరు రాజు అనుచరులు పోరాడుతూ చనిపోయారు. మరికొందరు పట్టుబడి అండమాన్ జైలుకు తరలించబడ్డారు. 270 మంది వరకు ఉద్యమకారులకు వివిధ రకరకాల శిక్షలు విధించారు. 12 మందిని అండమాన్ కాలాపానీకి పంపారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాల్ని తృణప్రాయంగా విడచిన అల్లూరికి అమర నీరాజనాలు. ఆయన జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. నూతన జిల్లాల విభజనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన పేరిట అల్లూరి సీతారామరాజు జిల్లాని ప్రకటించింది.
- రేగుళ్ళ మల్లికార్జునరావు , సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్క ృతిక శాఖ.. 94916 59899










