Jul 18,2022 07:09

నాయన ఎల్లిపోయిన ఏడేళ్లకు
నా రెక్కలింకా ముదరకుండానే
అమ్మ ఎల్లిపోయింది
అదే ఎల్లడం! మరి రానే నేదు

ఒకేల ఎపుడన్నా వత్తే
మనూరి పెద్ద చెరువు కాడ
ఈశరమ్మ పక్క పొలంలో
ఏ గింజ లేసావని అడుగుతుంది!
కొత్త గొలుపులప్పుడు
పద్మక్క చేత్తో జావొండి వడ్డించావా లేదా అని
వాకబు చేస్తుంది

మీ నాన్న లేక
నా చెయ్య కురసైపోయిందని
జనం గంటు పెట్టుకున్న కాగ్నుండీ
అక్క చేత్తోనే గదరా అన్నీ చేస్తన్నాం
అని గురుతుకు తెస్తుంది

పెద్ద చెరువు కాడ పొలం మెడలో
తాత కట్టిన పుస్తెలతాడును తెంపేసి
ఇటుకబట్టీతో ఇంకో మనువు కుదరేసి పంపేశానని
అమ్మకి తెలీదు కదా!
ఊరితో లగ్గం చేసుకున్న
చిటికెన వేలిని నరికేసీ పట్నం కొంగట్టుకుని
కూలీ డబ్బులతో కులుకుతున్నానంటే
అమ్మ పేనం కటకట లాడకుండా ఉంటాదా?

అమ్మ గురుతు కొస్తుంటే
ఇప్పుడు చానా బయ్యమేస్తంది
చంటి దాన్ని తానం చేపించి
బొమ్మల్లేసి కాపుతుంటే
దాని మెడలో గొలుసేదిరా అని
గదమాయించి అడుగుతుందని బయ్యం!

నాన్న లేక లేక చేపించి
అమ్మ మెడలో ఏసిన మూడు పేటల గొలుసు
తొలిసిరి ఆడబిడ్డని అమ్మ
పేమగా మా చంటిదాని అరతలేసిన గొలుసు
అప్పుల చేటలో ఆస్తుల్ని చెరుగుతున్నప్పుడే
వరి ఊకలా ఎగిరిపోయిందని అమ్మకేం తెలుసు?

రాతిరి అటు నుంచిటు తిరగబడుతుంటే
సీకట్లో అమ్మ చెయ్యి నా తలాపన తగిలింది
'సిన్నోడా.. లెగిమీ పొలానికి నీలెట్టేసి వొద్దుమా' అని
అడుగుతుంది!
దుడుకు బడుకు లెగిసి సూస్తే
అక్కడ అమ్మా నేదు
అమ్మలాటి ఊరూ నేదు
ఆవు పొదుము లాటి సేనూ నేదు

గుండెల కాడొక కాకి మాత్రం
ఒకటే అరుపు!

- సాంబమూర్తి లండ
96427 32008