ఉనికి లేకపోవటమే శూన్యమా
విశ్వమంతా విస్తరించిన
నైరూప్య ఆవరణమే శూన్యమా
పంచభూతాలను ధిక్కరిస్తూ
అంతరిక్షం పన్నిన పన్నాగమే శూన్యమా
ఆకాశాన్ని మునివేళ్లపై మోస్తున్న
అశరీర బంధమే శూన్యమా
ఇంతకీ శూన్యమంటే ఏమిటి
పదార్థం కాకుండా మిగిలిపోయిన
అదృశ్యశక్తుల అనిర్మాణమా
విశ్వాంతర్హిత మౌన సాగరమా
అంతర్ధానమైన అణువుల విన్యాసమా
వాయుగోళాల నిశ్శబ్ద నిద్రాసనమా
మాయకు
మారుపేరు కాదూ శూన్యమంటే!
నికరమైన ఖాళీతనానికి
నిండైన నిర్వచనం కాదూ శూన్యమంటే!
అసంఖ్యాకంగా వస్తుసమూహాల్ని కౌగిలించుకోగల
అనంతానంత అమ్మ ఒడి కాదూ శూన్యమంటే -
ఎప్పుడైనా
శూన్యశరీరాన్ని స్పృశించావా
ఎంత సుతారంగా పక్కకు తప్పుకొని
నిన్ను విశ్వవేదికపై
ప్రత్యక్షం చేస్తుందో చూశావా
నువ్వు నిరంతరం
లోహపురెక్కలతో ఉపగ్రహ శూలాలతో
ఖండఖండాలు చేస్తున్నది
శూన్యాన్ని కాదూ
అంతెందుకు ...
గడికోసారి నువ్వు ఖాళీ అవుతుంటావు
శూన్యమైపోతున్నావా?
సున్నా అయిపోతున్నావా?
శూన్యంలో ఐక్యం కావటమంటే సున్నాగా మారటం కాదు
కాలాన్ని మోహరహితంగా అలంకరించుకోవటం
మజిలీల్ని మహౌన్నతంగా వెలిగించుకోవటం
అంతరాత్మ చుట్టూ అంటుకునే మంటల్ని చల్లార్చుకోవటం
ఏమీ లేనితనంలోంచి బయటపడి చైతన్యాన్ని కౌగిలించుకోవటం
ప్రయత్నించి చూడు
శూన్యంలో గిరికీలు కొట్టిన ప్రతిసారీ
నిన్నూ నీ జీవితాన్నీ సరికొత్తగా నిర్వచించుకుంటావు
నువ్వొక నిండు అశూన్యపవనమై లోకమంతా విస్తరిస్తావు !
- ఎమ్వీ రామిరెడ్డి
98667 77870










