కవన వనంలో కొన్ని పుస్తకాల పువ్వులు పరిమళాలను వెదజల్లటం చూస్తుంటాం. పది మంది చదివి ప్రశంసల జల్లు కురిపించటమే ఫలించటం. ఫలశృతి లేని జీవితం జీవితమే కాదు. మనిషి తన జీవితకాలంలో ఏ సిద్ధాంతాల మీద నిలబడ్డాడన్నది ప్రధాన అంశం. నీటి పారుదల శాఖలో ఉద్యోగ విరమణ చేసిన రచయిత కపిల రాంకుమార్ అక్షరాల్లా ప్రవహించటం వృత్తి ప్రవృత్తి కలిసొచ్చిన అంశమే! ఒక వ్యక్తి సాహిత్య, కళా రంగాల్లో ఏడు పదులు దాటినా ధీటుగా ప్రవహించటం గొప్ప విషయమే. కమ్యూనిస్టు భావజాలంతో బోడెపూడి విజ్ఞాన కేంద్రం గ్రంథాలయంలో పదేళ్లు గ్రంథ పాలకుడిగా విధులు నిర్వర్తించటం కూడా ఆయన అభిరుచికి అద్దం పడుతుంది. సాహిత్య కృషి ద్వారా ఇరు తెలుగు రాష్ట్రాల్లో రచయిత కపిల రాంకుమార్ చిరపరిచితులే.
ఇటీవల ఖమ్మంలో కలం కలకలం కవితా సంపుటి, నగారా గీతాల సంపుటి పుస్తకాల పరిచయం, ఉరుములు మెరుపులు కవిత్వ పుస్తక ఆవిష్కరణ సభ వర్షపు జల్లులోనూ కోలాహలంగా జరిగింది. ఈ మూడు పుస్తకాల గురించి ముచ్చటగా మూడు మాటలు చెప్పుకోవాలి. ఆ మూడు పువ్వుల (పుస్తకాల) సుగంధాన్ని, ఆరు కాయల తియ్యందనాన్ని కొంతైనా మనం ఆస్వాదించాలి.
ప్రముఖ కవి కీ.శే. రావెళ్ల వెంకట రామారావు ముందుమాట వెలువరించిన 'కలంకలకలం' కవితా సంపుటిలో 63 కవితలు అచ్చువేశారు. ఇన్నాళ్లీ గొంతుక ఎక్కడ దాక్కుంది? అని రావెళ్ల ప్రశ్నించారు కూడా. విప్లవ భావజాల గొంతుక వున్న ఈ కవి ఏ స్వరం విన్నా సామ్యవాదం తొనికిసలాడుతూనే వుంటుంది. ఓ గొప్ప విషయమేమిటంటే మహాకవులు శ్రీశ్రీ, దేవులపల్లి కష్టశాస్త్రి లాంటివారు ఆయనకు అక్షరాభ్యాసం చేశారు. అంతటి మహాభాగ్యంలో ఆయన అక్షర శరాలను సంధించకుండా వుంటారా.. ఈ సంపుటిలో సంస్కృతిని వెతుకుతాను అంటూ ప్రారంభించిన కవితతో ప్రజాస్వరం కవితతో ముగుస్తుంది. మధ్యలో వున్న ఎన్నో కవితలు ఆయన ఆదర్శాన్ని తనదైన శైలిలో స్పశించారు. భయపడేది చావుకు కాదు అనే కవితలో .. సగం కాలిన కాయంతో/ శ్రమ కాల్సిన గాయంతో/ సమస్యల కాలంలో/ సమకాలీన గేయంతో/ నేను కన్‌ఫ్యూజ్ అవుతున్నాను/ అందుకే కంజ్యూమ్మ్ అవుతున్నాను/ అయినా లక్ష్యాన్ని ఎజ్యూమ్మ్ చేస్తా/ విప్లవాన్ని రెజ్యూమ్మ్ చేస్తా... అంటారాయన. ప్రాస పదాలతో పాటు భావాన్ని గొప్పగా ప్రజంట్ చేశారు. గొంతు కలుపు కవితలో ఇక్కడ ఇప్పుడు అంకురాలకు అమ్మదనం అద్దె ఇల్లు అవుతోంది అంటూ సరోగసి విధానానికి అద్దం పట్టారు.ఈ సంపుటిలో ఇలా ఎన్నో కవితలు మనల్ని హత్తుకుంటాయి.
ఇక నగారా గీతాల సంపుటిలో రచయిత కపిల రాంకుమార్ 31 గీతాలను పుస్తకంలో పొందుపరిచారు. ప్రముఖ కవి సీతారాం, అద్దేపల్లి రామ్మోహనరావు, పొత్తూరి వెంకట సుబ్బారావు, సుధామ ముందుమాట రాశారు. 'మతము, జపము, తపము కంటే కూడు గుడ్డ కూటికోసం ఎల్ల వేళల సమరశీలత పెంచుకొనుటే భారతీయత' అని నగారా మోగించారు. ఇంకా 'ముదనష్టపు బుద్ధులు మార్చగాను పాడెద - ముదము కూర్చ వారిని లాలించి చూచెద' అంటూ వంగ్యాస్త్రాల్ని సంధించారు. అమ్మలేని లోకమెందుకు? వెర్రితలల జ్ఞానమెందుకు? అని ఆలోచనాత్మకమైన భావాలను పాటల్లో వినిపించారు. ప్రతి గీతం సామాజిక స్పృహ మనలో పల్లవిస్తుంది.
ఉరుములు - మెరుపులు సంకలనం కలగూరగంప కవిత్వం అని కవే ప్రకటించుకున్నారు. ఇందులో లిమరిక్కులు, టుమ్రీలు, రన్నింగ్ కామెంటరీ, మినీలు, నానోలు ఇలా అన్ని ప్రక్రియలూ కవి కపిల అక్షర ప్రయోగంలో రూపుదిద్దుకున్నాయి. ఈ పుస్తకానికి ప్రముఖ కవి, విమర్షకులు ప్రసేన్ చక్కని ముందుమాట రాశారు. వస్తువు, శిల్పం, భావ వ్యక్తీకరణ మనకు భిన్నంగా కనిపిస్తాయి. చమత్కృతులు చాలా వున్నాయి. పరువును పరువున/ పరువులో/ కలపకు/... పాపకైనా-కను/ పాపకైనా/ ప్రాపకమున్నంత వరకే.. ధనమైనా ఇంధనమైనా దగ్ధం కానంతవరకే... ఇలా అంత్యాను ప్రాసలు వాడటంలో చాలా నైపుణ్యం కనిపిస్తుంది. గొడుగు అభయం/ పడగ భయం .. అంటూ టుమ్రీలు మన నెత్తిన మొట్టకాయలు వేస్తాయి. ఏదేమైనా మూడు పువ్వులూ ఆరు కాయలుగా కపిల బాబారు కవిత్వం సాగింది అనటం నిస్సందేహం.
- డా .కటుకోఝ్వల రమేష్
99490 83327










