Jul 18,2022 06:55

చూస్తూ వుంటే గులాబీల అందం వెనక
గుండెల్ని చీల్చే ముళ్ళులా వుంది లోకం!
అంతకంతకు నేల
కన్నీటితో తడిసి ముద్దవుతుంది
పువ్వులు ఏడుపుల్ని
తలలో ముడుచుకు తిరుగుతున్నాయి
డిజిటల్‌ వెలుతుర్లో సరిగా కనపడ్డంలేదు గానీ
బాధలు జిగేల్న మెరిసిపోతున్నాయి
ఎంత సర్ది చెప్పుకుందామన్నా
ఎరువు నగలేసుకుని
పెళ్ళిలో తిరుగుతున్న
పెద్ద ముత్తయుదులా వుంది కాలం

లిప్‌ స్టిక్‌ పెదాలు
ఐ లైనర్‌ చూపులు
హై హీల్‌ నడకలు
హై రైజ్డ్‌ మేడలు
ఎక్కడ చూసినా
కళలా భ్రమింపజేసే కళావిహీనమే
ఎంత సరిచేద్దామన్నా కుదిరేలా లేదు
అచ్చం సవరంతో
అల్లిన వాలుజడలా వుంది దేశం

తండ్రీ కూతురు కలిసి
మందుకొడుతున్న వెండితెర మీద
మనసు మూసుకోటానికైనా
కళ్ళు తెరుచుకోటానికైనా
ఇంతకంటే ఏ దృశ్యాన్ని అడ్డు పెట్టుకోగలం!
గుండె పట్టనంత ఆనందం
ఇప్పుడు మొబైల్‌ ఫోన్లో
అరనిమిషం రీల్‌కి కుదించుకుపోయాక
ఏ రసానుభూతైనా ఏముందిలే
బట్టతల మీద బొచ్చు స్టిక్కర్లా వుంది వర్తమానం!

తళుకు బెలుకుల తొక్కిసలాటలో
నలిగిపోతున్న ఈ బతుకు ముఖం మీద
నా వంతుగా ఒక చిన్న నవ్వైనా
అతికించాలని వుంది
ఎక్కడన్నా నవ్వు అమ్మబడితే బాగుణ్ణు!

- బంగార్రాజు కంఠ
85003 50464