చెప్పడం కష్టమేమీ కాదు
బూడిద పువ్వులపై నుంచి
దుర్గంధ తరంగాల్లోకి జారిపోవడాన్ని,
కాళ్ల కింద పడి నలిగే
దేవుళ్ల గుసగుసల్ని
రక్తపాత విజయాలు ఇంకిపోవడాన్ని
చర్మంలోంచి పాకే భయం
విరిగిపోవడాన్ని
ఉడుకుతున్న సున్నం బట్టీలో
ముఖాలు చెదిరిపోతాయి
అసూయా భానుడు
వేటగాడి కళ్లలోకి
సుస్వరాలను నేస్తాడు
కుచించుకుపోయిన మనిషిని
రాత్రి నెర్రెల్లోంచి బయటకు తీయాలి
నిద్రను ధరించినప్పుడు
సుడులు తిరిగే సాయంకాలాల్ని వలుస్తున్న వాడు
నునుపెక్కిన ఉషోదయాన్ని
దుప్పట్లో జారవిడచడం
పురాతన తప్పిదమే!
కడుపులో మాడిపోయే
ఆకలి నెలవంకను, స్వప్నం లేని
ఆకు తొడగని కాంతి మూలుగుల్లోంచి
వేలాడే చీకటిని, ఎండిన తల్లి పాలిండ్లను,
అంతుచిక్కని నీలి ఆకాశాలు
కఠిన రోదన
బండరాళ్ల కొమ్ములు
వినపడని మూలుగు రెక్కల తాకిడి
పోగొట్టుకున్న నిడివి లేని ఏకాంతం
మనుషులుగా, మబ్బులుగా
కొమ్మల నుంచి వీచే లేతగాలి తరగలా
సూర్యకాంతిలా
నది నెత్తిమీద పొద్దులా వికసించాలి
నిశ్శబ్దానికి కట్టుబడి ఉన్నచోట
అక్షరం నాట్యమాడుతుంది!
- అఖిలాశ
72595 11956










