అధికారులు సమన్వయంతో పనిచేయాలి
ప్రజాశక్తి-కావలి : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాధాన్యతా పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో డివిజన్ స్థాయిలోని అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు పేర్కొన్నారు. కావలి రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయ ఆవరణలో నూతనంగా పునర్‌నిర్మించిన సమావేశ మందిరాన్ని శనివారం ఆర్.డి.ఒ వి. కె.శీనా నాయక్‌తో కలసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాధాన్యతా పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో డివిజన్ స్థాయిలోని అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలన్నారు. ఈ సంవత్సరం వేసవి కాలంలో ఎక్కువ ఉష్ణోగతలు పెరిగే అవకాశం ఉందని, వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ప్రజలు ఎక్కడా తాగునీటికి ఇబ్బంది పడకుండా ముందస్తు ప్రణాళికతో సంబంధిత శాఖల అధికారులు ముందుకు వెళ్లాలన్నారు. ఈ వేసవిలో డివిజన్ పరిధిలో తాగునీటి సమస్యను అధిగమించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రధాన రహదారి కూడళ్ల వద్ద స్కూల్స్, హాస్పిటల్స్, అంగన్‌వాడీ కేంద్రాల వద్ద తాగునీటి వసతి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. రెండో పంటకు కూడా సాగు నీటిని ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కావలి పట్టణ పరిధిలో అందరికీ ఇళ్ల కార్యక్రమం కింద మెగాలేఅవుట్‌లో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. ఈ మెగా లే అవుట్‌లో 3 వేల గృహాలు ఒకేసారి గృహప్రవేశాలు జరిగేలా ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయడానికి అన్నీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ భూమికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చుక్కల భూముల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. చుక్కల భూముల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో ఒక ప్రత్యేక సెల్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో డి.ఎస్.పి వెంకటరమణ, ఇన్‌ఛార్జి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, తహశీల్దార్ మాధవరెడ్డి, ఎంపిడిఒ ఎ.వి.సుబ్బారావు, ఆర్.డి.డి తహశీల్దార్, కార్యాలయపు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.










