Jun 30,2023 16:48

హరారే : జింబాబ్వేలో కరోనా కేసులు పెరిగాయి. దేశవ్యాప్తంగా దాదాపు 3,107 కలరా కేసులున్నాయని సమాచార ప్రచార, ప్రసార సేవల మంత్రి మోనికా ముత్స్వాంగ్వా గురువారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. కలరా వల్ల 19 మంది మృతి చెందారని, మరో 52 కలరా అనుమానిత మరణాలుగా నమోదైనట్లు ఆమె తెలిపారు. అయితే, కలరా నుంచి 2,910 మంది కోలుకున్నారని మోనికా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 'మణికాలాండ్‌ ప్రావిన్స్‌లో అత్యధికంగా 1,251 కలరా కేసులు నమోదయ్యాయి. అలాగే దేశ రాజధాని హరారేలో 1,121, సౌత్‌ ప్రావిన్స్‌లో మతాబెలెలాండ్‌ ప్రాంతంలో 277 కలరా కేసులు నమోదయ్యాయి. కలరా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం అన్నివిధాలుగా చర్యలు చేపట్టింది. మంచినీరు, పరిశుభ్రత మరియు పారిశుద్ధ్యం సవాళ్లను అధిగమించేలా ప్రభుత్వం కృషి చేస్తుంది' అని ఆమె తెలిపారు.
కాగా, ఈ ఏడాది మే నెల నుంచే జింబాబ్వేలో కలరా వ్యాప్తి చెందుతోంది. మే 16వ తేదీ దాదాపు 1,017 కలరా అనుమానిత కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శిశుసంరక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఆ సమయంలో కలరా వల్ల ఆరుగురు మృతి చెందారని ల్యాబ్‌లు ధృవీకరించాయి. ఇక జూన్‌ 7వ తేదీన కలరాతో 15 మంది మృతి చెందినట్లు సమాచార, ప్రచార, ప్రసార సేవా మంత్రి వెల్లడించారు.